Hyderabad: కేపీహెచ్‌బీలో విషాదం.. ఆఫీసు భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్య!

Hyderabad: భాగ్యనగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది.

Update: 2026-02-06 07:17 GMT

Hyderabad: భాగ్యనగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న యువతి ఆఫీసు భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. అనారోగ్య సమస్యలే ఈ ఆత్మహత్యకు ప్రధాన కారణమని ప్రాథమిక సమాచారం అందుతోంది.

మూడో అంతస్తు నుంచి దూకి..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా మద్దినాయనిపల్లి గ్రామానికి చెందిన అనిత (23) హైదరాబాద్‌లో ఉంటూ సీబీసీఐడీ కాలనీలోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. గురువారం మధ్యాహ్నం ఆఫీసులో ఉన్న సమయంలో ఒక్కసారిగా భవనం మూడో అంతస్తు నుంచి ఆమె కిందకు దూకేసింది.

తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడివున్న అనితను గమనించిన తోటి ఉద్యోగులు, స్థానికులు వెంటనే స్పందించి నిజాంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఎమర్జెనీ వార్డులో చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించి ఆమె ప్రాణాలు కోల్పోయింది.

అనారోగ్యమే కారణమా?

అనిత మృతిపై కేసు నమోదు చేసిన కేపీహెచ్‌బీ పోలీసులు విచారణ చేపట్టారు. గత కొంతకాలంగా అనిత తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతోందని, దీనివల్ల ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైందని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనారోగ్యం కారణంగానే ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకుని ఉండవచ్చని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి, తదుపరి విచారణ జరుపుతున్నారు.

Tags:    

Similar News