Jeevan Reddy: కాంగ్రెస్‌లో జీవన్‌రెడ్డి ఎపిసోడ్.. రాజీనామా వేళ అనూహ్య మలుపు!

Jeevan Reddy: ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో పెను తుపాను చెలరేగింది.

Update: 2026-03-24 06:07 GMT

Jeevan Reddy: కాంగ్రెస్‌లో జీవన్‌రెడ్డి ఎపిసోడ్.. రాజీనామా వేళ అనూహ్య మలుపు!

Jeevan Reddy: ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో పెను తుపాను చెలరేగింది. గత కొంతకాలంగా పార్టీ పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో అధిష్టానం ఉలిక్కిపడింది. మార్చి 25న (రేపు) ఆయన అధికారికంగా పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది.

జీవన్ రెడ్డి నిర్ణయాన్ని మార్చుకునేలా చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం చివరి నిమిషం వరకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మరికాసేపట్లో జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి చేరుకోనున్నారు. ఇప్పటికే మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ చేసిన రాయబారాలు విఫలం కావడంతో, స్వయంగా పీసీసీ అధ్యక్షుడే రంగంలోకి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

గత 20 నెలలుగా పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, సొంత పార్టీలోనే ఎదురవుతున్న అవమానాలపై జీవన్ రెడ్డి రగిలిపోతున్నారు. ముఖ్యంగా స్థానిక రాజకీయాల్లో తన ప్రాధాన్యతను తగ్గించేలా జరుగుతున్న పరిణామాలే ఆయన తీవ్ర నిర్ణయానికి కారణమని సమాచారం.

"అవమానం భరించలేక కాంగ్రెస్‌ను వీడాలని నిర్ణయించుకున్నాను. నా అనుచరులు, కార్యకర్తలతో చర్చించిన తర్వాతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాను." అని జీవన్ రెడ్డి గత ఆదివారమే స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసం వద్ద వెలిసిన ఒక పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకవైపు జీవన్ రెడ్డి, మరోవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ ఫోటోలతో ఉన్న ఈ పోస్టర్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. ఆయన రాజకీయ ప్రస్థానం ఇక ఏ దారిలో ఉండబోతుందనే దానిపై పలు ఊహాగానాలు మొదలయ్యాయి.

రేపు (మార్చి 25) జీవన్ రెడ్డి తన ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. పీసీసీ చీఫ్ చర్చల అనంతరం ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా? లేక హస్తం పార్టీకి శాశ్వతంగా వీడ్కోలు పలుకుతారా? అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్.

Tags:    

Similar News