దేశ నిర్మాణంలో ఎగ్జిబిషన్ సొసైటీ పాత్ర కీలకం
ఆరు దశాబ్దాలుగా 20 విద్యా సంస్థల ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తూ దేశ నిర్మాణంలో ఎగ్జిబిషన్ సొసైటీ కీలకపాత్ర పోషిస్తోందని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ : ఆరు దశాబ్దాలుగా 20 విద్యా సంస్థల ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తూ దేశ నిర్మాణంలో ఎగ్జిబిషన్ సొసైటీ కీలకపాత్ర పోషిస్తోందని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. UGC స్వయం ప్రతిపత్తి, NBA గుర్తింపు, NAAC A+ గ్రేడ్ సాధించిన ఈ సంస్థ తెలంగాణలో ఫార్మాస్యూటికల్ రంగానికి కేంద్రబిందువుగా నిలిచిందని మంత్రి అన్నారు. తార్నాకలోని సరోజిని నాయుడు వనిత ఫార్మసీ మహా విద్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సిల్వర్ జూబ్లీ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
హైదరాబాద్ నేడు ప్రపంచంలోనే బల్క్ డ్రగ్స్ ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా ఎదిగిందని, ఫార్మసీ విద్యార్థులకు విస్తృత ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయన్నారు. “తెలంగాణ రైజింగ్ 2047” దృష్టితో హైదరాబాద్‌ను ప్రపంచ జీవ శాస్త్రాల రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
గ్రీన్ ఫార్మా సిటీతో పాటు వికారాబాద్, మెదక్, నల్గొండ జిల్లాల్లో ప్రత్యేక ఫార్మా గ్రామాల ఏర్పాటు ద్వారా పరిశ్రమల అభివృద్ధిని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నామని తెలిపారు. లైఫ్ సైన్సెస్ రోడ్‌మ్యాప్ 2030 ద్వారా ₹1 లక్ష కోట్లు పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిందన్నారు.
సెల్, జీన్ థెరపీ, MRNA వ్యాక్సిన్లు, బయోలాజిక్స్, AI ఆధారిత డ్రగ్ డిస్కవరీ వంటి ఆధునిక రంగాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని, ప్రత్యేక లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుపై ఆలోచనలో ఉందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.
2025 పట్టభద్రులైన విద్యార్థులు తెలంగాణ ఫార్మా రంగ భవిష్యత్తుకు దిశానిర్దేశకులవుతారని ఆశాభావం వ్యక్తం చేస్తూ, వారి విజయ ప్రయాణంలో తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణంగా తోడుంటుందని భరోసా ఇచ్చారు.