వృధా జలాలు వాడుకుంటామంటే అభ్యంతరం ఎందుకు?

బంగాళాఖాతంలో కలిసిపోతున్న గోదావరి వృధా జలాలను దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ వాడుకుంటామంటే ఎవరికి ఏ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

Update: 2025-12-19 11:54 GMT

న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో కలిసిపోతున్న గోదావరి వృధా జలాలను దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ వాడుకుంటామంటే ఎవరికి ఏ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి శుక్రవారం ఉదయం ఆయన కేంద్ర జల్ శక్తి శాఖా మంత్రి సీ.ఆర్.పాటిల్‌తో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు, వివిధ ప్రాజెక్టులకు నిధుల విడుదలపై కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో చర్చించి, పలు విజ్ఞప్తులు చేశారు. ప్రత్యేకించి విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని కోరమన్నారు.

పెండింగ్ అంశాలపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని అడిగినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు నీటి భద్రత అత్యంత కీలక అంశమని, రాష్ట్రంలో సాగునీటి-తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.

ప్రాజెక్టులపై కేంద్ర–రాష్ట్ర సమన్వయం మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరపాలని, గోదావరి, వంశధార బోర్డుల నిబంధనలకు అనుగుణంగా అనుమతులిచ్చి సత్వర పూర్తికి సహకరించాలని కోరినట్లు రామానాయుడు చెప్పారు.

గోదావరి నదీ జలాల వినియోగానికి సంబంధించి వివాదం విషయంలో తమకు పెద్దగా ఆసక్తి లేదన్నారు. ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలు అందరూ బాగుండాలనేదే తమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన, ఆశయం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అంతర్గత రాజకీయ పరిస్థితుల నేపథ్యం కూడా ఈ వివాదానికి కొంత కారణమై ఉండవచ్చు అని రామానాయుడు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం, సీతమ్మ సాగర్ తదితర ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ, అడ్డు పడలేదన్నారు. అలాంటప్పుడు దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ వృధా జలాలను వాడుకుంటామంటే సహకరించాల్సిన అవసరం ఉందని రామానాయుడు చెప్పారు. గడచిన 50 ఏళ్లలో 1.53 లక్షల టిఎంసిల గోదావరి వరద నీరు సముద్రం పాలైపోయిందని, గడచిన ఐదేళ్లలో 20,000 టిఎంసిల నీరు బంగాళాఖాతం పాలయిందన్నారు. ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కడితే దిగు రాష్ట్రం నష్టపోతుంది తప్పితే తెలంగాణ ఎడారి అవుతుంది అనడంలో అర్థం లేదు అన్నారు.

భారతదేశం సస్యశ్యామలం అవడానికి నదుల అనుసంధాన ప్రక్రియ అత్యంత కీలకమని దివంగత మాజీ ప్రధాని వాజ్ పేయి ఏనాడో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్నది కూడా, అదే కార్యక్రమంగా ఆయన చెప్పారు. ఏటా సగటున మూడు వేల టీఎంసీలు గోదావరి జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయని, అందులో కేవలం 200 టీఎంసీలు మాత్రమే మేము ప్రతిపాదించిన ప్రాజెక్టుకు సరిపోతుందన్నారు. ఈ ప్రతిపాదన తక్షణం అంగీకరించి అనుమతులు ఇవ్వాల్సిన అవసరం ఉందని జల శక్తి మంత్రి దృష్టికి తీసుకువచ్చినట్లు రామానాయుడు చెప్పారు.

Tags:    

Similar News