Cold Wave: తెలంగాణలో చలి తీవ్రత.. మూడు రోజులు ఆరెంజ్ అలర్ట్

తెలంగాణ అంతటా ఒక్కసారిగా పెరిగిన చలి తీవ్రత 19 జిల్లాల్లో 10 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు వచ్చే మూడు రోజులు పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’

Update: 2025-12-20 05:28 GMT

Cold Wave: తెలంగాణలో చలి తీవ్రత.. మూడు రోజులు ఆరెంజ్ అలర్ట్

తెలంగాణ అంతటా ఒక్కసారిగా పెరిగిన చలి తీవ్రత

19 జిల్లాల్లో 10 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు

వచ్చే మూడు రోజులు పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’

తెలంగాణ రాష్ట్రం మొత్తం చలి పంజా విసురుతోంది. ఈశాన్య భారతదేశం నుంచి వీస్తున్న చల్లని గాలుల ప్రభావంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. సాయంత్రం మొదలయ్యే చలి ప్రభావం మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు కొనసాగుతోంది. వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11.9 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగా నమోదయ్యాయి.

ప్రత్యేకంగా 19 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపే ఉండటంతో ప్రజలు తీవ్ర చలితో గజగజ వణుకుతున్నారు. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో అత్యల్పంగా 6.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోని జహీరాబాద్, పటాన్‌చెరు, సదాశివపేట సహా 14 మండలాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది.

అలాగే కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్(యు), వాంకిడి, కెరమెరి మండలాల్లో చలి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్, శేరిలింగంపల్లి, శంషాబాద్ సహా 18 మండలాల్లో, వికారాబాద్ జిల్లా తాండూరు, మర్పల్లి ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 6.1 నుంచి 6.9 డిగ్రీల మధ్య నమోదయ్యాయి.

వచ్చే మూడు రోజులు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శనివారం జనగామ జిల్లా మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేశారు. ఆదివారం 22 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. సోమవారం 12 జిల్లాల్లో తీవ్రమైన చలిగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

చాలా ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల కంటే దిగువకు పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ, వృద్ధులు, చిన్నపిల్లలు మరియు శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

చలికాలంలో బయటకు వెళ్లేటప్పుడు తల, చెవులు కప్పేలా టోపీలు లేదా మఫ్లర్లు ధరించాలి. మందపాటి దుస్తులు, సాక్సులు వాడటం ద్వారా శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి. వేడిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. రోగనిరోధక శక్తిని పెంచే అల్లం, మిరియాలు, పసుపు కలిపిన పాలు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజర్లు వాడుతూ, గోరువెచ్చని నీటిని తాగి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలని తెలిపారు.

Tags:    

Similar News