హైదరాబాద్‌లో భయపెడుతోన్న కరోనా దూకుడు

Update: 2020-06-13 07:40 GMT
Representational Image

హైదరాబాద్‌లో రోజురోజుకీ పెరుగుతోన్న కరోనా కేసులు ప్రజలను కలవరపెడుతున్నాయి. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 85శాతం జీహెచ్‌ఎంసీలోనే ఉండటం భయాందోళనలు కలిగిస్తోంది. లాక్-డౌన్ సడలింపులు తర్వాత కేసులు పెరుగుతుండటం ఆందోళన రేపుతోంది.

గ్రేటర్ హైదరాబాద్‌లో రోజురోజుకీ కరోనా వైరస్ పంజా విసురుతోంది. ఎక్కడ ఎవరి ద్వారా వ్యాప్తి చెందుతుందోనన్న భయం అందరినీ వెంటాడుతోంది. మరోవైపు కాంటాక్టు కేసులను గుర్తించడం కష్టంగా మారింది. గడిచిన వారం రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. జూన్ ఒకటి నుండి ఇప్పటివరకు జీహెచ్ఎంసీ పరిధిలోనే 13వందలకు పైగా కేసులు నమోదుకాగా, 85 శాతం మరణాలు జీహెచ్ఎంసీలో జరిగాయి. అయితే, లాక్-డౌన్ సడలింపులు తర్వాతే గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది

లాక్‌-డౌన్ సడలింపులు, ప్రజల నిర్లక్ష్యంతో కొత్త ప్రాంతాల్లో పెద్దఎత్తున కేసులు నమోదవుతున్నాయి. అంబర్‌పేటలో ఇప్పటివరకు 192మందికి వైరస్ సోకగా, అందులో 22మంది మరణించారు. అలాగే, ఎల్బీనగర్‌లో 17 కేసులు నమోదుకాగా హయత్‌నగర్‌, నాగోల్‌, వనస్థలిపురంలో 33మందికి కోవిడ్‌ వచ్చింది. ఇందులో ఒకరు మృత్యువాతపడ్డారు.

ఇక, ముషీరాబాద్‌లో 102 కేసులు నమోదుకాగా ఏడుగురు మరణించారు. సికింద్రాబాద్‌లో 23మందికి కోవిడ్‌ సోకగా ముగ్గురు కరోనాకు బలయ్యారు. అలాగే, ఖైరతాబాద్‌లో 60 శంషాబాద్‌లో 13 కేసులు నమోదు అయ్యాయి. అత్యధికంగా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో జియాగూడ ముందుంది. ఇక్కడ ఇప్పటివరకు 208మందికి వైరస్ సోకగా 8మంది మృత్యువాత పడ్డారు.

గ్రేటర్ పరిధిలో రోజూ వంద నుంచి 175 కేసులు నమోదు అవుతుండటంతో అందరిలో ఆందోళన వ్యక్తం అవుతోంది. వంద మందికి టెస్ట్ లు చేస్తే పది మంది వరకు పాజిటివ్ వస్తోంది. ప్రంట్ లైన్ వారియర్స్ ను సైతం కరోనా వదలటం లేదు. ఇక, లాక్ డౌన్ సడలింపుల తర్వాత చాలా కేసులకు లింకులు దొరకటం లేదు. ప్రస్తుతం నమోదు అవుతున్న కేసుల్లో 80శాతం మందికి లక్షణాలే ఉండటం లేదు. దాంతో, బలహీనులు ఎఫెక్ట్‌ అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. మరోవైపు, ప్రజలు ఎక్కడ భౌతిక దూరం పాటించడం లేదు. హైదరాబాద్  మెట్రో పాలిటన్ సిటీ కావడంతో అధికారులు సైతం చేతులెత్తేస్తున్నారు. అయితే, పరిస్థితి ఇలాగే కొనసాగితే జులై చివరి లోపు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే, హైదరాబాద్‌లో మరోసారి పూర్తిస్థాయి లాక్‌ డౌన్ పెడితే బాగుంటుందని జనం అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News