Bandi Sanjay: మహదేవప్పది ఆత్మహత్య కాదు... కాంగ్రెస్ చేసిన హత్య
Bandi Sanjay: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
Bandi Sanjay: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది ఆత్మహత్య కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ముమ్మాటికీ 'రాజకీయ హత్యే'నని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్‌ను రాళ్లతో కొట్టే రోజులు వస్తాయి: బండి సంజయ్
మహదేవప్ప మృతిపై స్పందించిన బండి సంజయ్.. రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. "ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలు అరాచకాలకు తెగబడుతున్నారు. అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తూ ఆత్మహత్యలకు ఉసిగొల్పుతున్నారు" అని మండిపడ్డారు.
మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రత్యక్ష యుద్ధం ప్రకటిస్తామని ఆయన హెచ్చరించారు. గతంలో బీఆర్ఎస్ అరాచకాలను ఎదురించిన చరిత్ర బీజేపీ కార్యకర్తలదని, ఇప్పుడు కాంగ్రెస్‌ను కూడా భూస్థాపితం చేసే రోజులు దగ్గరపడ్డాయని వ్యాఖ్యానించారు. మహదేవప్ప ఆత్మహత్యకు కారకులైన కాంగ్రెస్ నేతలను వెంటనే అరెస్ట్ చేయాలని, పారదర్శక విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
కలచివేసిన ఘటన: రాంచందర్ రావు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కూడా ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మహదేవప్ప మృతి తనను ఎంతగానో కలచివేసిందని, ఎన్నికల తరుణంలో ఇలాంటి విషాదం జరగడం బాధాకరమని అన్నారు. కార్యకర్తలెవరూ ధైర్యం కోల్పోవద్దని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
మరోవైపు, మహదేవప్ప మృతికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి. అభ్యర్థి మరణంతో మక్తల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు.