HYDRA: కొండాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్: రూ.700 కోట్ల విలువైన ‘జంగమోనికుంట’ భూమి రక్షితం.. కబ్జాదారులపై ఉక్కుపాదం!

HYDRA: భాగ్యనగరంలోని విలువైన ప్రభుత్వ భూములను, జలవనరులను రక్షించడమే లక్ష్యంగా హైడ్రా (HYDRA) మరో భారీ విజయాన్ని నమోదు చేసింది.

Update: 2026-02-10 09:17 GMT

HYDRA: భాగ్యనగరంలోని విలువైన ప్రభుత్వ భూములను, జలవనరులను రక్షించడమే లక్ష్యంగా హైడ్రా (HYDRA) మరో భారీ విజయాన్ని నమోదు చేసింది. కొండాపూర్ ప్రాంతంలోని శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం - మదీనగూడ ప్రధాన రహదారి సమీపంలో ఉన్న జంగమోనికుంట ఆక్రమణలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. సుమారు రూ.700 కోట్ల విలువైన 4 ఎకరాల భూమిని కబ్జాదారుల నుంచి విముక్తి కల్పించారు.

కుంటను మాయం చేసి ప్లాట్లుగా విక్రయం!

సర్వే నంబర్ 134 పరిధిలో ఉన్న జంగమోనికుంటను ఆక్రమణదారులు మట్టితో నింపి పూర్తిగా చదును చేసినట్లు అధికారులు గుర్తించారు. చెరువు అస్తిత్వాన్నే కనుమరుగు చేసి, ఆ స్థలాన్ని ప్లాట్లుగా విభజించి విక్రయించడానికి సిద్ధం చేసినట్లు విచారణలో వెల్లడైంది. దీనిపై స్థానికుల నుంచి అందిన ఫిర్యాదులతో స్పందించిన హైడ్రా, రెవెన్యూ అధికారులతో కలిసి జాయింట్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించి కబ్జాను నిర్ధారించింది.

పోలీసుల సహకారంతో రక్షణ చర్యలు

అక్రమ కబ్జాలను పూర్తిగా తొలగించడమే కాకుండా, భవిష్యత్తులో మళ్లీ ఆక్రమణలు జరగకుండా హైడ్రా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇప్పటికే రెవెన్యూ అధికారులు అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పోలీసుల సహకారంతో కుంట చుట్టూ శాశ్వత ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసే పనులను హైడ్రా సిబ్బంది ప్రారంభించారు. ఈ స్థలం ప్రభుత్వానిదని, ఇక్కడ ప్లాట్లు కొంటే చర్యలు తప్పవని హెచ్చరిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు.

ప్రభుత్వ భూములు, చెరువుల రక్షణలో హైడ్రా చూపిస్తున్న వేగంపై నగర ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. కబ్జాదారుల వెనుక ఎంతటి వారున్నా వదిలిపెట్టవద్దని సామాన్యులు కోరుతున్నారు.

Tags:    

Similar News