Telangana Municipal Elections 2026: తెలంగాణ మున్సిపల్ పోరు: పలుచోట్ల ఉద్రిక్తత.. అభ్యర్థుల మధ్య ఘర్షణలు, బోగస్ ఓట్ల కలకలం!

Telangana Municipal Elections 2026: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.

Update: 2026-02-11 06:50 GMT

Telangana Municipal Elections 2026: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. పోలింగ్ కొనసాగుతున్న వేళ పలు జిల్లాల్లో స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

మహబూబాబాద్ మున్సిపాలిటీలోని 14 వార్డులో టెన్షన్ వాతావరణం నెలకొంది.100 మీటర్ల లోపు ప్రచారం నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాగేశ్వరరావు పై బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బత్తుల కృష్ణ చేయి చేసుకున్నాడు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి హెచ్చరించి పంపించారు.

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని 9వ వార్డు లో ఓ కానిస్టేబుల్ కాంగ్రెస్ కి ఓటు వేయమని ఓటర్లకు చెప్పడనీ ఆరోపిస్తూ బిజెపి,బిఆర్ఎస్ అభ్యర్థులుగొడవకు దిగారు .కానిస్టేబుల్ ను పోలింగ్ కేంద్రం నుండి ఎస్ఐ వెంకట్ రావు పంపించివేయడంతో గొడవ సద్దు మనిగింది.

సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కసారిగా రాజకీయ సెగ రాజుకుంది. 45వ వార్డులో పోలింగ్ జరుగుతున్న క్రమంలో బిఆర్ఎస్ (BRS) అభ్యర్థి మరియు స్వతంత్ర అభ్యర్థి వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.ఓట్ల వేటలో ఇరు వర్గాల మధ్య మాట మాట పెరిగి అది స్వల్ప ఘర్షణకు దారితీసింది. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది.పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు వెంటనే స్పందించారు. ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.ప్రస్తుతం వార్డులో అదనపు బలగాలను మోహరించారు. పోలింగ్ సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు.

వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సెంటర్ లో స్టేషన్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. 13వ వార్డు 27వ పోలింగ్ స్టేషన్ లో బోగస్ ఓట్లు వేస్తున్నారంటూ... ఓటర్ ను బయటకు పంపాలంటూ కాంగ్రెస్ ఏజెంట్ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. దీంతో కాంగ్రెస్, బీఆర్ ఎస్ నేతల మధ్య వాగ్వాదం చెలరేగింది. పోలింగ్ సెంటర్ లో అందరినీ బయటకు గెంటేశారు పోలీసులు. పోలింగ్ సెంటర్ దగ్గర ఉద్రిక్తతలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. 

Tags:    

Similar News