Coronavirus Effect: ప్రజా రవాణా ఎప్పుడు మొదలవుతుంది..?

Coronavirus Effect: ప్రజా రవాణా ఎప్పుడు మొదలవుతుంది..? సగటు హైదరాబాద్ వాసికి జవాబు లేని ప్రశ్నగా మారిపోయింది.

Update: 2020-07-07 13:58 GMT

Coronavirus Effect: ప్రజా రవాణా ఎప్పుడు మొదలవుతుంది..? సగటు హైదరాబాద్ వాసికి జవాబు లేని ప్రశ్నగా మారిపోయింది. కరోనా తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ఇప్పుడప్పుడే బస్సులు రోడ్డెక్కేలా లేవు. మెట్రో ట్రైన్స్ పట్టాలెక్కే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రైవేటు జాబ్‌లు చేసేవారు ఇతర పనులకు వెళ్లే వారు నిత్య నరకాన్ని చూస్తున్నారు. ఆటోలు, క్యాబ్‌లకు డబ్బులు పెట్టలేక రోడ్డెక్కాలంటేనే భయపడుతున్నారు.

బయటకు వెళ్తే కరోనా భయం ఉద్యోగానికి వెళ్లకపోతే ఎక్కడ ఊడిపోతుందో అనే టెన్షన్. ఇలాంటి సందర్భంలో ఏదేమైనా ఎలాగైనా తెగించి అడుగు బయటపెట్టిన నగరవాసికి ప్రయాణ కష్టాలు వెంటాడుతున్నాయి. కొద్దిపాటి దూరానికే వందల్లో వసూలు చేస్తున్నారు ఆటోవాలాలు. బస్సులేమో లేవు కరోనా కాలంలో లిఫ్ట్‌ ఇచ్చేందుకు కూడా వాహనదారులు వెనకాడుతున్నారు. దీంతో గమ్యాన్ని చేరుకోవాలంటేనే భారీగా చేతి చమురు వదులుతోంది. అసలే జీతాలు సరిగ్గా రాని సమయంలో ఈ నష్టాలు తాము భరించలేని స్థితిలో ఉన్నామంటున్నారు.

నిత్యం 33 లక్షల మందిని గమ్యాలకు చేర్చే సిటీ బస్సులు రోడ్డెక్కకపోవడంతో నగరజీవి బతుకు భారమవుతోంది. బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు క్యాబ్‌లు, ఆటోలే దిక్కవడంతో వారు చెప్పినంత ఇచ్చుకోవాల్సిన దుస్తితి వచ్చింది. కొద్ది దూరానికే వందల్లో చార్జీలు వసూలు చేస్తున్నారు.

మరోవైపు రోజూ 4 లక్షల మంది ప్రయాణించే మెట్రో రైలు సర్వీసులు కూడా గత నాలుగు నెలల నుంచి ఆగిపోవడంతో వాటిపై ఆధారపడ్డ వారికి కూడా ఇబ్బందులు తప్పడం లేదు. అంతేకాకుండా నిత్యం లక్షన్నర మంది ప్రయాణించే ఎంఎంటీఎస్ సర్వీసులు కూడా నడవడం లేదు. దీంతో హైదరాబాదీలకు ప్రయాణకష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.


Tags:    

Similar News