నేడు తెలంగాణకు కేంద్ర బృందం

Update: 2020-08-10 05:41 GMT
Representational Image

central team to visit telangana today: దేశంలో కరోనా వైరస్‌ కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. అయితే అన్ని రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో కరోనా కంట్రోల్ లో ఉన్నట్టు కనిపించినా తెలంగాణలో కూడా కరోనా కేసులు భారీగానే నమోదు అవుతున్నాయి. రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులను అంచనా వేసేందుకు పర్యటిస్తున్న కేంద్రం బృందం నేడు తెలంగాణకు రానుంది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు, చికిత్సల వివరాలను తెలుసుకునేందుకు కేంద్ర బృందం ఢిల్లీ నుంచి వస్తున్నట్లు తెలుస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇష్టారాజ్యంగా ఫీజుల వసూలుపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కేంద్రం ఇక్కడకు బృందాన్ని పంపిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రానికి వచ్చే కేంద్ర బృందం సోమవారం పలు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలను పరిశీలించనుంది.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న(ఆదివారం) రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,256 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 80,751కి చేరింది. మృతుల సంఖ్య 637కి పెరిగింది. నిన్న ఒక్క రోజే 1,587 మంది హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా వైరస్ నుంచి కోలుకోని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 57,586కి చేరింది. ప్రస్తుతం 22,528 మంది చికిత్స పొందుతున్నారు. కాగా ఆదివారం 11,609 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో 6,24,840 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. తెలంగాణలో రికవరీ రేటు 71.31 శాతంగా ఉంది. కాగా జాతీయస్థాయిలో రికవరీ రేటు 68.78శాతం ఉంది.




Tags:    

Similar News