Shubman Gill : రికార్డు క్రియేట్ చేసిన శుభ్‌మన్ గిల్.. నాలుగోసారి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు
Shubman Gill: టీమిండియా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన గిల్, ఇప్పుడు ఐసీసీ జూలై నెలకు ప్లేయర్ ఆఫ్ ది మంత్ పురస్కారాన్ని దక్కించుకున్నాడు.
Shubman Gill: టీమిండియా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన గిల్, ఇప్పుడు ఐసీసీ జూలై నెలకు ప్లేయర్ ఆఫ్ ది మంత్ పురస్కారాన్ని దక్కించుకున్నాడు. ఈ అవార్డును నాలుగు సార్లు గెలుచుకున్న తొలి మేల్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.
భారత టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కారణంగా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు దక్కించుకున్నాడు. ఈ పురస్కారం కోసం ఐసీసీ ముగ్గురు ఆటగాళ్లను నామినేట్ చేసింది. గిల్‌తో పాటు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ వియాన్ ముల్డర్ కూడా పోటీలో ఉన్నారు. కానీ, శుభ్‌మన్ గిల్ తన అసాధారణ ప్రదర్శనతో ఈ దిగ్గజ ఆటగాళ్లను వెనక్కి నెట్టి ఈ ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నాడు.
ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో 25 ఏళ్ల శుభ్‌మన్ గిల్ తన బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. జూలై నెలలో ఆడిన మూడు టెస్ట్ మ్యాచ్‌లలో గిల్ 94.50 సగటుతో మొత్తం 567 పరుగులు సాధించాడు. ఈ మూడు టెస్టులలో ఆరు ఇన్నింగ్స్‌లలో ఒక డబుల్ సెంచరీ, రెండు సెంచరీలు నమోదు చేశాడు. కేవలం బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా, కెప్టెన్‌గా తన తొలి పర్యటనలోనే జట్టును విజయవంతంగా నడిపించి ఈ అవార్డుకు అర్హత సాధించాడు.
శుభ్‌మన్ గిల్ ఇప్పటివరకు తన కెరీర్‌లో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును నాలుగు సార్లు గెలుచుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి మేల్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాది ఫిబ్రవరితో పాటు 2023లో జనవరి, సెప్టెంబర్ నెలల్లో కూడా గిల్ ఈ పురస్కారాన్ని దక్కించుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించిన గిల్, 75.40 సగటుతో 754 పరుగులు సాధించి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డును కూడా గెలుచుకున్నాడు. గిల్ నాయకత్వంలో భారత్ ఈ సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఇది కెప్టెన్‌గా గిల్‌కు మొదటి పర్యటన కావడం విశేషం.
జూలై నెలకు ఐసీసీ అవార్డు గెలుచుకోవడంపై శుభ్‌మన్ గిల్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. బర్మింగ్‌హామ్‌లో సాధించిన డబుల్ సెంచరీ తన జీవితాంతం గుర్తుండిపోతుందని, ఈ అవార్డుకు అర్హత సాధించడం చాలా సంతోషంగా ఉందని సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.