IPL 2026-KKR: ఐపీఎల్ 2026కు ముందు కేకేఆర్‌కు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్!
IPL 2026-KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)కు భారీ దెబ్బ తగిలింది. యువ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా మోకాలి గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.
IPL 2026-KKR: ఐపీఎల్ 2026కు ముందు కేకేఆర్‌కు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్!
IPL 2026-KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)కు భారీ దెబ్బ తగిలింది. యువ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా మోకాలి గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. నివేదికల ప్రకారం.. 24 ఏళ్ల హర్షిత్ ఇటీవల మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. పూర్తిగా కోలుకోవడానికి మరో రెండు నుంచి మూడు నెలలు పట్టే అవకాశం ఉండటంతో.. ఐపీఎల్ 2026కి దూరమయ్యాడు. అయితే ఈ విషయాన్ని కేకేఆర్ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
టీ20 ప్రపంచ కప్ 2026కు ముందు దక్షిణాఫ్రికాపై నవీ ముంబైలో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఆడుతున్న సమయంలో హర్షిత్ రాణా గాయపడ్డాడు. దీంతో అతను మెగా టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అతని స్థానంలో భారత జట్టులోకి హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ వచ్చాడు. ఫిబ్రవరి 9న ముంబైలో రాణాకు శస్త్రచికిత్స జరిగింది. శస్త్రచికిత్స తర్వాత ఈ ఆల్‌రౌండర్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. హర్షిత్ స్థానంలో ఇప్పటి వరకు ఎవరినీ రిప్లేస్‌మెంట్‌గా తీసుకోలేదు. కేకేఆర్‌ఇప్పటికే ఆకాష్ దీప్, వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్, కార్తీక్ త్యాగి వంటి పేసర్లు ఉన్నారు.
హర్షిత్ రాణా గత కొన్ని సీజన్లలో కేకేఆర్‌కు కీలక ఆటగాడిగా నిలిచాడు. ముఖ్యంగా ఐపీఎల్ 2024లో జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్‌లో 19 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ ప్రదర్శన కారణంగా అతనికి భారత జట్టులో కూడా అవకాశం వచ్చింది. ఐపీఎల్ 2025కు ముందు కేకేఆర్ అతన్ని రూ.4 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఆ సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడి 15 వికెట్లు తీసి మంచి ప్రదర్శన చేశాడు. దురదృష్టవశాత్తు హర్షిత్ అందుబాటులో ఉండకపోవచ్చు అని కోల్‌కతా ఫ్రాంచైజీకి చెందిన ఓ అధికారి చెప్పినట్లు తెలుస్తోంది. హర్షిత్ స్థానంలో ఇంకా ఎవరినీ భర్తీ చేయలేదని తెలిపారు.
ఇప్పటికే కేకేఆర్ మరో కీలక మార్పు చేసింది. బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ స్థానంలో జింబాబ్వే పేసర్ ముజరబానీను జట్టులోకి తీసుకుంది. టీ20 వరల్డ్ కప్ 2026లో ముజరబానీ అద్భుత ప్రదర్శన చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాపై నాలుగు ఓవర్లలో 4/17 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. 6 అడుగులు 8 అంగుళాల ఎత్తు ఉన్న ముజరబానీ.. తన బౌన్స్, వేగంతో బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బందులు పెడుతున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటికే 90కి పైగా వికెట్లు పడగొట్టాడు. ముజరబానీ రాక కేకేఆర్ బౌలింగ్ దళానికి పెద్ద బలంగా మారుతుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.