Muzarabani-PCB: మమ్మల్నే వద్దంటావా?.. జింబాబ్వే స్టార్ పేసర్‌పై పీసీబీ ఫైర్, చట్టపరమైన చర్యలు!
Muzarabani-PCB: జింబాబ్వే స్టార్ పేసర్ బ్లెస్సింగ్ ముజరబానిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎస్) 2026లో ఆడాల్సిన ముజరబాని.. చివరి నిమిషంలో ఆ టోర్నీ నుంచి ఐపీఎల్ 2026లో చేరడమే అందుకు కారణం.
Muzarabani-PCB: మమ్మల్నే వద్దంటావా?.. జింబాబ్వే స్టార్ పేసర్‌పై పీసీబీ ఫైర్, చట్టపరమైన చర్యలు!
Muzarabani-PCB: జింబాబ్వే స్టార్ పేసర్ బ్లెస్సింగ్ ముజరబాని తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎస్) 2026లో ఆడాల్సిన ముజరబాని.. చివరి నిమిషంలో ఆ టోర్నీ నుంచి తప్పుకుని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో చేరడమే అందుకు కారణం.
పీఎస్‌ఎల్ 11వ సీజన్‌లో భాగంగా ఇస్లామాబాద్ యునైటెడ్ ఫ్రాంచైజీ బ్లెస్సింగ్ ముజరబానిని రూ.11 మిలియన్ పాకిస్థాన్ రూపాయలకు కొనుగోలు చేసింది. షమార్ జోషెఫ్ స్థానంలో పీఎస్‌ఎల్‌లో ఆడడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే ఇదే సమయంలో ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ అతనికి అవకాశం ఇచ్చింది. బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ స్థానంలో ముజరబానిని కేకేఆర్ తీసుకుంది. దీనిపై కేకేఆర్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. బీసీసీఐ ఆదేశాల మేరకు ముస్తాఫిజుర్‌ను కోల్‌కతా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ముజరబాని తన పీఎస్‌ఎల్ ఒప్పందాన్ని వదులుకుని ఐపీఎల్‌లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. దీంతో పీసీబీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ముజరబానీ ఒప్పందాన్ని ఉల్లంఘించి.. ఐపీఎల్‌లో చేరుతుండడంతో పీసీబీ చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
పీఎస్‌ఎల్‌లో ఇలాంటి సంఘటన ఇది మొదటిసారి కాదు. గత సంవత్సరం దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ కోర్బిన్ బాష్ కూడా పీఎస్‌ఎల్ జట్టు పెషావర్ జల్మితో ఒప్పందం చేసుకున్నప్పటికీ.. చివరికి ముంబై ఇండియన్స్ జట్టులో చేరేందుకు ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు. ఆ ఘటన తర్వాత బోష్‌పై పీఎస్‌ఎల్ ఒక సంవత్సరం నిషేధం విధించింది. ఒకవేళ పీసీబీ చర్యలు తీసుకుంటే.. బ్లెస్సింగ్ ముజరబానిపై కూడా నిషేధం పడనుంది. ప్రస్తుతం ముజరబాని తీసుకున్న నిర్ణయంపై పీసీబీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఇక బ్లెస్సింగ్ ముజరబాని ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2026లో అద్భుత ప్రదర్శన చేశాడు. జింబాబ్వే తరఫున కీలక బౌలర్‌గా నిలిచిన అతను మొత్తం 13 వికెట్లు తీసి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. ముజరబాని ప్రదర్శన జింబాబ్వే సూపర్-8 దశకు చేరడంలో కీలక పాత్ర పోషించింది. ఆస్ట్రేలియాపై 4 ఓవర్లలో 4/17 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. 6 అడుగులు 8 అంగుళాల ఎత్తు ఉన్న ముజరబాని.. తన బౌన్స్, వేగంతో స్టార్ బ్యాట్స్‌మెన్‌లను సైతం ఇబ్బందులు పెడుతున్నాడు.