Suryakumar Yadav: ఆ ఘోర ఓటమి అనంతరం.. బ్యాటర్లకు ప్రత్యేకంగా 'బాహుబలి' సాంగ్‌ పెట్టాం, ఇక రెచ్చిపోయారు!

Suryakumar Yadav: టీ20 వరల్డ్‌ కప్ 2026 విజయం తర్వాత టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జట్టు విజయానికి వెనుక ఉన్న సన్నాహాలు, ఆటగాళ్ల ప్రదర్శన గురించి పలు విషయాలు చెప్పాడు.

Update: 2026-03-12 12:21 GMT

Suryakumar Yadav: టీ20 వరల్డ్‌ కప్ 2026 విజయం తర్వాత టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జట్టు విజయానికి వెనుక ఉన్న సన్నాహాలు, ఆటగాళ్ల ప్రదర్శన గురించి పలు విషయాలు చెప్పాడు. ముఖ్యంగా దక్షిణాఫ్రికాతో ఓటమి తర్వాత జట్టు మరింత కట్టుదిట్టంగా సన్నద్ధమైందని తెలిపాడు. సూపర్-8లో భాగంగా దక్షిణాఫ్రికాపై ఘోర ఓటమి అనంతరం.. బ్యాటర్లకు ప్రత్యేకంగా 'బాహుబలి' సాంగ్‌, బౌలర్ల కోసం కేసరి చాప్టర్ 2 సినిమాలోని ‘ఓ షేరా తీర్ తే తాజ్' పాట వినిపించి స్ఫూర్తి నింపామని చెప్పుకొచ్చాడు. ఇక అక్కడి నుంచి టీమిండియా ప్లేయర్స్ రెచ్చిపోయారని సూర్య సరదాగా అన్నాడు.

సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ... 'దక్షిణాఫ్రికాపై ఓటమి తర్వాత జట్టుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాం. ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ ప్రాక్టీస్ సమయంలో అత్యుత్తమంగా ఫీల్డింగ్ చేసిన ఆటగాడికి రూ.10,000 బహుమతి ప్రకటించారు. అలాగే జట్టు వీడియో అనలిస్ట్ గత రెండు సంవత్సరాలకు సంబంధించిన కీలక క్షణాలతో 10 నిమిషాల వీడియోను ప్లే చేసి ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపారు. అంతేకాకుండా ఆటగాళ్లలో జోష్ పెంచేందుకు ప్రత్యేకంగా పాటలను కూడా వినిపించారు. బ్యాటర్ల కోసం బాహుబలి సినిమాలోని పాటను, బౌలర్ల కోసం కేసరి చాప్టర్ 2 చిత్రంలోని ‘ఓ షేరా తీర్ తే తాజ్’ పాటను వినిపించి ప్రేరణ ఇచ్చారు. అపుడు ప్లేయర్స్ అందరూ ఆత్మవిశ్వసంతో కనిపించారు. ఆ తర్వాత ఎలా ఆడారో మిరే చూశారు' అని చెప్పాడు.

'వరల్డ్‌ కప్ జట్టు ఎంపికకు ముందు ఇషాన్‌ కిషన్‌కు నేను వ్యక్తిగతంగా ఫోన్ చేశా. నా కోసం వరల్డ్‌ కప్ గెలిపిస్తావా? అని అడిగా. మీరు నాపై నమ్మకం ఉంచితే తప్పకుండా సాధిస్తాను అని ఇషాన్ చెప్పాడు. చెప్పినట్టుగానే మెగా టోర్నీలో అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడడు. సంజు శాంసన్ అద్భుత ప్రదర్శన చేశాడు. వరుసగా మూడు కీలక మ్యాచులలో హాఫ్ సెంచరీలు బాదాడు. అతడు వచ్చాక జట్టు మూమెంటమ్ పూర్తిగా మారిపోయింది. నాకు చాలా సంతోషంగా ఉంది. భారత్ వరుసగా రెండోసారి టీ20 వరల్డ్‌కప్‌ను గెలుచుకుంది. మొత్తం మీద భారత్ మూడు సార్లు టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్నట్లైంది. మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలన్నదే లక్ష్యం' అని సూర్య చెప్పాడు.

2026 వరల్డ్‌ కప్ గెలిచిన రోజు తనకు అసలు నిద్ర పట్టలేదని సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత స్టేడియాన్ని వదిలి వెళ్లాలనిపించలేదని, రాత్రి 2 గంటల వరకు అక్కడే జట్టు సభ్యులతో కలిసి సంబరాలు చేసుకున్నామని చెప్పాడు. హోటల్‌కు వెళ్లిన తర్వాత కూడా నిద్ర పట్టలేదని, జట్టులో చాలా మంది ఉదయం 7 గంటల వరకు మేల్కొని వరల్డ్‌ కప్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారని సూర్యకుమార్ గుర్తుచేసుకున్నాడు.

Tags:    

Similar News