IPL 2026 Schedule: ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ విడుదల.. 10 వేదికల్లో 20 మ్యాచ్‌లు, ఫుల్ డీటెయిల్స్ ఇవే!
IPL 2026 Schedule: ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన తొలి దశ షెడ్యూల్‌ను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఐపీఎల్ 19వ ఎడిషన్ తొలి దశ మార్చి 28న ప్రారంభమై.. ఏప్రిల్ 12 వరకు కొనసాగనుంది.
IPL 2026 Schedule: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు సంబంధించిన తొలి దశ షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది. ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 లీగ్‌గా గుర్తింపు పొందిన ఐపీఎల్ 19వ ఎడిషన్ తొలి దశ మార్చి 28న ప్రారంభమై.. ఏప్రిల్ 12 వరకు కొనసాగనుంది. మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పూర్తి షెడ్యూల్‌ను తర్వాత ప్రకటించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తమ హోమ్ గ్రౌండ్ అయిన బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)తో తలపడనుంది. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ 2026 ఆరంభం కానుంది. తొలి దశలో మొత్తం 20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లు దేశవ్యాప్తంగా 10 వేదికల్లో జరుగుతాయి. బెంగళూరు, ముంబై, గువాహటి, న్యూ చండీగఢ్, లక్నో, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్ నగరాల్లో తొలి దశ మ్యాచ్‌లు జరుగుతాయి.
తొలి దశలో మొత్తం నాలుగు డబుల్ హెడర్లు ఉన్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు మొదటి మ్యాచ్.. రాత్రి 7:30 గంటలకు రెండవ మ్యాచ్ ప్రారంభం అవుతాయి. టోర్నీ రెండవ మ్యాచులో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో తొలి డబుల్ హెడర్ ఏప్రిల్ 4న జరగనుంది. ఆ రోజు మధ్యాహ్నం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో పోటీ పడతాయి. అనంతరం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి.
రాజస్థాన్ రాయల్స్ తమ హోమ్ మ్యాచ్‌లను గువాహటిలో ప్రారంభించనుంది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లతో రాజస్థాన్ ఆడనుంది. పంజాబ్ కింగ్స్ ప్రారంభ హోమ్ మ్యాచ్‌లను న్యూ చండీగఢ్‌లోని పీసీఏ స్టేడియంలో జరుగుతాయి. ఈ సీజన్‌లో ఆర్సీబీ బెంగళూరులో ఐదు హోమ్ మ్యాచ్‌లు ఆడనుండగా.. మరో రెండు మ్యాచ్‌లను రాయ్‌పూర్‌లో ఆడనుంది. పంజాబ్ కింగ్స్ న్యూ చండీగఢ్‌లో నాలుగు హోమ్ మ్యాచ్‌లు, ధర్మశాలలో మూడు మ్యాచ్‌లు ఆడనుంది. రాజస్థాన్ రాయల్స్ గువాహటిలో మూడు మ్యాచ్‌లు, జైపూర్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడుతుంది. ఐపీఎల్ 2026 ప్రారంభ దశ షెడ్యూల్ విడుదల కావడంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ వెల్లడించనుంది.