IPL 2026 Schedule: ఐపీఎల్ 2026పై బిగ్ అప్‌డేట్.. షెడ్యూల్‌ విడుదలకు ముహూర్తం ఫిక్స్!

IPL 2026 Schedule: ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. 19వ సీజన్ షెడ్యూల్‌ను మార్చి 12న విడుదల చేయనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు.

Update: 2026-03-10 15:22 GMT

IPL 2026 Schedule: ఐపీఎల్ 2026పై బిగ్ అప్‌డేట్.. షెడ్యూల్‌ విడుదలకు ముహూర్తం ఫిక్స్!

IPL 2026 Schedule: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు సంబంధించి బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. 19వ సీజన్ షెడ్యూల్‌ను మార్చి 12న విడుదల చేయనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. అయితే ప్రస్తుతం మొత్తం షెడ్యూల్‌ను కాకుండా.. మొదటి 20 రోజుల మ్యాచ్‌ల షెడ్యూల్‌ మాత్రమే ప్రకటించనున్నట్లు తెలిపారు. ఐపీఎల్ 19వ సీజన్ మార్చి 28 నుంచి మే 31 వరకు జరుగనుంది.

మొదట ఐపీఎల్ 2026ని మార్చి 26 నుంచి మే 30 వరకు నిర్వహించాలని బీసీసీఐ సహా ఐపీఎల్ గవర్కింగ్ కౌన్సిల్ నిర్ణయించింది. తాజాగా ఆ తేదీల్లో స్వల్ప మార్పులు చేశారు. ఆరంభ తేదీని మార్చి 28కి వాయిదా వేసినట్లు ఇటీవల ప్రకటించారు. ఆటగాళ్లు, ఫ్రాంచైజీలకు కాస్త సమయం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక మార్చి 12న మొదటి 20 రోజుల షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించడానికి ఒక ముఖ్యమైన కారణం ఉందని తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కారణంగా మ్యాచ్‌ల షెడ్యూల్.. ఎన్నికల తేదీలతో పోటీ లేకుండా ఉండేలా బీసీసీఐ జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకే మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్‌ను తరువాత ప్రకటించే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా ఐపీఎల్ 2026 కోసం ఫ్రాంచైజీలు ఇప్పటికే ప్రీ-సీజన్ సన్నాహాలు ప్రారంభించాయి. ఐదుసార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మార్చి 1 నుంచి నవలూర్‌లోని హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో ప్రాక్టీస్ ప్రారంభించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఈ శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫిబ్రవరి 10న ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ప్రాక్టీస్ క్యాంప్ నిర్వహించింది. గుజరాత్ టైటాన్స్ జట్టు రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారాలో ఉన్న మిరాజ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రెండు సార్లు ప్రాక్టీస్ సెషన్లు నిర్వహించింది.

పంజాబ్ కింగ్స్ జట్టు ఫిబ్రవరి ప్రారంభంలో అబుదాబిలో శిక్షణ శిబిరం నిర్వహించి.. ప్రస్తుతం ధర్మశాలలో ప్రాక్టీస్ కొనసాగిస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మార్చి 1 నుంచి తమ దేశీయ ఆటగాళ్లతో శిక్షణ ప్రారంభించింది. ఐదుసార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు కూడా వచ్చే సీజన్ కోసం ప్రాక్టీస్ ప్రారంభించింది. రాజస్థాన్ రాయల్స్ మార్చి 15 నుంచి జైపూర్‌లో ప్రాక్టీస్ క్యాంప్ ప్రారంభించే అవకాశం ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ మార్చి 18 నుంచి తమ ప్రీ-సీజన్ క్యాంప్‌ను మొదలుపెట్టనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇటీవల హైదరాబాద్‌లో ఒక ప్రాక్టీస్ క్యాంప్ నిర్వహించగా.. త్వరలో న్యూఢిల్లీలో మరో శిక్షణ శిబిరం ఏర్పాటు చేయనుంది. లక్నో సూపర్ జెయింట్స్ కూడా లక్నోలో ప్రిపరేషన్ సెషన్ నిర్వహించింది.

Tags:    

Similar News