MS Dhoni-IPL 2026: ఎంఎస్ ధోనీ కండిషన్స్.. సీఎస్కే మేనేజ్‌మెంట్ అసంతృప్తి?

MS Dhoni-IPL 2026: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ స్థానంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సీఎస్కే మేనేజ్‌మెంట్ ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌పై సంతృప్తిగా లేదని చెన్నై క్యాంప్‌లోని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.

Update: 2026-03-15 14:45 GMT

MS Dhoni-IPL 2026: ఎంఎస్ ధోనీ కండిషన్స్.. సీఎస్కే మేనేజ్‌మెంట్ అసంతృప్తి?

MS Dhoni-IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఒకటి. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో సీఎస్కే ఏకంగా ఐదు టైటిల్స్ గెలుచుకుంది. ప్రస్తుతం కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన మహీ.. కేవలం బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. గత రెండు సీజన్లుగా బ్యాటర్‌గా దిగువన వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ధోనీ బ్యాటింగ్ స్థానంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సీఎస్కే మేనేజ్‌మెంట్ ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌పై సంతృప్తిగా లేదని చెన్నై క్యాంప్‌లోని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.

ఎంఎస్ ధోనీ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో దిగువన దిగుతుండటం సీఎస్కే మేనేజ్‌మెంట్‌కు నచ్చడం లేదని తెలుస్తోంది. మ్యాచ్ చివర్లో కేవలం 10 బంతులు మాత్రమే ఆడటం కంటే.. పవర్‌ప్లేలోనే బ్యాటింగ్‌కు వచ్చి కొన్ని భారీ సిక్సర్లు బాదితే జట్టుకు మరింత ఉపయోగం ఉంటుందని యాజమాన్యం భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ధోనీని ఓపెనింగ్‌కు పంపాలని మేనేజ్‌మెంట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రతిపాదనకు ధోనీ పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. తన బ్యాటింగ్ స్థానంపై ధోనీ ఇప్పటికే మేనేజ్‌మెంట్ ముందు కొన్ని షరతులు పెట్టినట్లు సమాచారం. తాను కేవలం నంబర్ 7, 8 లేదా 9 స్థానాల్లోనే బ్యాటింగ్‌కు వస్తానని మహీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా మ్యాచ్‌లో అవసరమైన రన్‌రేట్ 15కు పైగా ఉన్నప్పుడు మాత్రమే తాను క్రీజ్‌లోకి రావడానికి సిద్ధంగా ఉంటానని సీఎస్కే మేనేజ్‌మెంట్‌కు ఎంఎస్ ధోనీ తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ అంశం సీఎస్కే వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ధోనీ కొన్నేళ్లుగా మోకాలి గాయంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయినా కూడా కీపింగ్ చేస్తున్నాడు. గత సీజన్లో అయితే ఊహించని రీతిలో క్యాచులు అందుకున్నాడు. బ్యాటింగ్లో కూడా అప్పుడప్పుడు మెరుపులు మెరిపించాడు. ఐపీఎల్ 2026లో కూడా మహీ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడనున్నాడు. ఇక ఈ సీజన్‌కు ముందు సీఎస్కే జట్టు వ్యూహాల్లో మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ధోనీ బ్యాటింగ్ స్థానంపై చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ 2026 మార్చి 28న ఆరంభం కానున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News