ICC ODI Rankings: కోహ్లీకి షాక్: నం.1 వన్డే ర్యాంకును కోల్పోయిన విరాట్.. టాప్ ప్లేస్‌లోకి కివీస్ స్టార్ డారిల్ మిచెల్!
ICC ODI Rankings: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో పెను మార్పులు చోటుచేసుకున్నాయి.
ICC ODI Rankings: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన అగ్రస్థానాన్ని కోల్పోయారు. న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాటర్ డారిల్ మిచెల్ అద్భుత ప్రదర్శనతో కోహ్లీని వెనక్కి నెట్టి నం.1 వన్డే బ్యాటర్‌గా అవతరించాడు.
మిచెల్ జోరు.. కోహ్లీకి నిరాశ: ఇటీవల భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో డారిల్ మిచెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 176 సగటుతో ఏకంగా 352 పరుగులు సాధించాడు. ఇందులో రెండు భారీ సెంచరీలు ఉండటం విశేషం. ఈ అద్భుత ఫామ్‌తో 845 పాయింట్లతో మిచెల్ అగ్రస్థానానికి చేరుకోగా.. కోహ్లీ 795 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. రాజ్‌కోట్ వన్డేలో విఫలమవ్వడం విరాట్ ర్యాంకుపై ప్రభావం చూపింది.
టాప్ 10లో భారత బ్యాటర్ల పరిస్థితి:
రోహిత్ శర్మ: కివీస్ సిరీస్‌లో విఫలమైన హిట్ మ్యాన్ మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి (757 పాయింట్లు) పడిపోయాడు.
శుభ్‌మన్ గిల్: 723 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.
కేఎల్ రాహుల్ & శ్రేయస్ అయ్యర్: రాహుల్ పదో స్థానంలో ఉండగా, శ్రేయస్ 11వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.
అఫ్గానిస్థాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ అనూహ్యంగా మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
ఇతర ఫార్మాట్లలో నంబర్ 1 వీరే:
టీ20 బ్యాటింగ్: భారత యువ సంచలనం అభిషేక్ శర్మ (908 పాయింట్లు) నం.1 స్థానంలో ఉండగా, తిలక్ వర్మ మూడో స్థానంలో ఉన్నాడు.
టెస్ట్ బ్యాటింగ్: ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 8వ స్థానంలో నిలిచాడు.
బౌలింగ్: టెస్టుల్లో జస్‌ప్రీత్ బుమ్రా, టీ20ల్లో వరుణ్ చక్రవర్తి, వన్డేల్లో రషీద్ ఖాన్ తమ ఆధిపత్యాన్ని చాటుతూ అగ్రస్థానాల్లో నిలిచారు.
దాదాపు నాలుగేళ్ల తర్వాత అగ్రస్థానాన్ని అందుకున్న కోహ్లీ, కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే దానిని కోల్పోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.