హైదరాబాద్‌లో దిగిన డేవిడ్ వార్నర్... SRH Vs RR మ్యాచ్ కోసం కాదు...

Update: 2025-03-23 08:51 GMT

హైదరాబాద్‌లో దిగిన డేవిడ్ వార్నర్... SRH Vs RR మ్యాచ్ కోసం కాదు...

David Warner in Hyderabad: డేవిడ్ వార్నర్ హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యారు. ఇవాళే ఐపిఎల్ 2025 టోర్నమెంట్‌లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. గతంలో డేవిడ్ వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కేప్టేన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వార్నర్ హైదరాబాద్ రావడం క్రీడావర్గాల్లో, క్రీడాభిమానుల్లో ఆసక్తిని పెంచింది. అయితే, ఈసారి వార్నర్ హైదరాబాద్ రావడానికి క్రికెట్‌కు ఎలాంటి కనెక్షన్ లేదనే విషయం కూడా చాలామందికి తెలిసిందే.

ఇన్నేళ్లపాటు క్రీజులో తన పర్‌ఫార్మెన్స్ చూపించిన డేవిడ్ వార్నర్ తొలిసారిగా సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇవ్వనున్నాడు. నితిన్ హీరోగా నటించిన రాబిన్‌హుడ్ సినిమాలో వార్నర్ ఒక అతిథి పాత్రలో కనిపించనున్నాడు.

వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన రాబిన్‌హుడ్ మార్చి 28న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. విడుదలకు మరో ఐదు రోజులే మిగిలి ఉండటంతో ఇవాళ మార్చి 23న హైటెక్స్‌లో సాయంత్రం 5 గంటలకు రాబిన్‌హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ కోసమే డేవిడ్ వార్నర్ హైదరాబాద్ వచ్చాడు.

హైదరాబాద్ వచ్చిన వార్నర్‌కు రాబిన్‌హుడ్ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఘన స్వాగతం పలికింది. ఎయిర్‌పోర్టులో వార్నర్‌ను రిసీవ్ చేసుకున్న దృశ్యాలను ఎక్స్ ద్వారా అభిమానులతో పంచుకుంది.

రాబిన్‌హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లోనే రాబిన్‌హుడ్ ట్రైలర్ కూడా లాంచ్ అవనుంది. ఈ సినిమాలో నితిన్ బాగా డబ్బున్న వారిని దోచుకుని పేదలకు పంచిపెట్టే ఒక దొంగ పాత్రలో కనిపించనున్నాడు. నితిన్ అభిమానుల్లో రాబిన్‌హుడ్‌ మూవీపై భారీ అంచనాలున్నాయి.

డేవిడ్ వార్నర్‌కు కూడా తెలుగు నాట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో అనుబంధం కారణంగా వార్నర్ తెలుగు హీరోల పాటలకు స్టెప్పులేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సందర్భాలున్నాయి. అలా వార్నర్ అంటే తెలుగు వారికి క్రికెటర్ కంటే ఇంకొంచెం ఎక్కువ అభిమానం ఏర్పడింది. ఇక ఇప్పుడు ఏకంగా తెలగు సినిమా ద్వారానే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తూ తెలుగు వారితో తన అనుబంధాన్ని నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్తున్నాడు.  

Tags:    

Similar News