iPhone Factory: చైనాలో కలకలం సృష్టిస్తున్న జీరో కోవిడ్‌.. కంచెలు దూకి పారిపోయిన ఉద్యోగులు..!

Lockdown: కరోనా సమయంలో ఉన్నట్టుండి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది.

Update: 2022-10-31 15:15 GMT

iPhone Factory: చైనాలో కలకలం సృష్టిస్తున్న జీరో కోవిడ్‌.. కంచెలు దూకి పారిపోయిన ఉద్యోగులు..!

Lockdown: కరోనా సమయంలో ఉన్నట్టుండి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో ఆయా రాష్ట్రాల నుంచి సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రజలు కాలినడకను ఆశ్రయించారు. ఇది అత్యంత దారుణమైన పరిస్థితి పట్టణాలు మూతపడడంతో నగరాల్లో ఉండలేక వందల కిలోమీటర్ల దూరంలోని సొంతూళ్లకు కాలినడకన పయనమయ్యారు. ఇలా కాలినడకలోనే ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను తలుచుకుంటే బాధితులు కన్నీటి పర్యంతమవుతారు. ఇప్పుడు అలాంటి ఘటనలే చైనాలో కనిపిస్తున్నాయి. జీరో కోవిడ్‌ పాలసీ పేరుతో కంపెనీల్లో పని చేసే పలువురు కార్మికులను చైనా నిర్బంధించింది. నెలల తరబడి కంపెనీల్లో ఉండలేక.. ఉపాధి లేక.. తినడానికి తిండి సరిగా అందక ఐదడుగుల ఎత్తున్న గోడలను దూకి పారిపోతున్నారు. వందలాది కిలోమీటర్ల దూరంలోని సొంతూళ్లకు కాలినడకన పయనమయ్యారు. కరోనా ప్రారంభంలో మన దేశంలో కనిపించిన నాటి పరిస్థితులు ఇప్పుడు డ్రాగన్‌ కంట్రీలో కనిపిస్తున్నాయి.

ఇటీవల చైనాలో కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో నెలల తరబడి లాక్‌డౌన్లు విధించడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా సోకిన వారిని ముట్టుకునేందుకు ఇప్పటికీ చైనాలో జంకుతున్నారు. రెండ్రోజుల క్రితం కరోనా సోకిన బాధితుడిని క్రేన్‌కు కట్టేసి కంటైనర్‌లోకి తరలించిన దృశ్యాలు బయటకొచ్చాయి. కంపెనీల్లో నెలల తరబడి మగ్గుతున్న కార్మికులు బయటికొస్తున్నారు. తాజాగా ఐఫోన్‌ తయారీ యూనిట్‌ నుంచి పలువురు కార్మికులు, ఉద్యోగులు ఎత్తైన గోడలను దూకుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చైనాలో యాపిల్‌ కంపెనీకి చెందిన అతి పెద్ద అసెంబ్లింగ్‌ యూనిట్‌ జెంగ్‌జౌలో ఉంది. కొవిడ్‌ కేసులు పెరిగిపోతుండడంతో ప్రభుత్వం నిర్దేశించిన కఠిన ఆంక్షలను యాపిల్‌ యాజమాన్యం కూడా అమలు చేస్తోంది. జెంగ్‌జౌలో లాక్‌డౌన్‌ విధించడంతో ఫాక్స్‌కాన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ఫాక్స్‌కాన్‌లో ఉన్న కార్మికులు నెలలకొద్ది బయటి వాతావరణంలోకి రాలేదు. దీంతో మానసికంగా కృంగిపోతున్నట్లు కూడా నివేదికలు చెప్తున్నాయి. ఈ కారణంగా ఫ్యాక్టరీ నుంచి బయటపడేందుకు ఉద్యోగులు దొంగచాటుగా కంచెలు దాటుతున్నారు. కొవిడ్ యాప్‌ చర్యల నుంచి బయటపడేందుకు వందలాది కిలోమీటర్ల దూరంలోని తమ సొంతూళ్లకు కాలినడకన వెళ్తున్నారు. అంతేకాదు ఈ యూనిట్లో వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో చాలా మంది ఉద్యోగులను క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందించారు. ఎక్కువ కాలం పాటు క్వారంటైన్‌లో ఉండడంతోనే మానసికంగా ఉద్యోగులు కృంగిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ యూనిట్‌లో 3 లక్షల మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. హెనాన్ ప్రావిన్స్ రాజధాని అయిన జెంగ్‌జౌ నగరంలో వారం రోజుల్లో 167 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అంతకుముందు వారంలో 97 కేసులు నమోదయ్యాయి.

వైరస్‌ను గుర్తించిన నాటి నుంచి చైనా జీరో కోవిడ్‌ విధానాన్ని అమలు చేస్తోంది. ఒక్క కేసు నమోదైనా ఆ ప్రాంతానికి చెందిన ప్రజలను క్వారంటైన్‌కు బలవంతంగా తరలిస్తున్నారు. ఆ ప్రాంతాన్ని వెంటనే మూసేస్తారు. ఇలా వరుస లాక్‌డౌన్లతో రెండేళ్ల నుంచి చైనీయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. లాక్‌డౌన్ల కారణంగా పరిశ్రమలు మూతపడుతున్నాయి. దీంతో ఉపాధి లేక తినడానికి తిండి కూడా లభించక అల్లాడిపోతున్నారు. మరోవైపు క్వారంటైన్‌ కేంద్రాలు జైళ్ల కంటే దారుణంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో క్వారంటైన్‌కు వెళ్లేందుకు చైనీయులు జంకుతున్నారు. దానికన్నా వైరస్‌తో చనిపోవడమే మేలని వాపోతున్నారు. జీరో కోవిడ్‌పై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నా చైనా ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అదే సరైన విధానమంటూ సమర్థించుకుంటోంది. జీరో కోవిడ్‌ విధానంతో చైనా మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందంటూ పలు దేశాలు విమర్శిస్తున్నాయి.


Tags:    

Similar News