Iran Israel Conflict : భారీ మూల్యం చెల్లించక తప్పదు.. ఇరాన్ అగ్రనేత ఖమేనీ ఖాతా నుంచి సంచలన పోస్ట్
Iran Israel Conflict : ఇరాన్ అగ్రనేత ఖమేనీ మరణం తర్వాత ఆయన ఎక్స్ ఖాతా నుంచి ఇజ్రాయెల్‌ను హెచ్చరిస్తూ పోస్ట్ వచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్‌లతో ఇది అస్తిత్వ పోరాటమని ఇరాన్ ప్రకటించింది.
Iran Israel Conflict
Iran Israel Conflict : మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ జ్వాలలు అంటుకున్నాయి. ఇరాన్ అగ్రనేత అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆ దేశం రగిలిపోతోంది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఖమేనీ చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన మరణం తర్వాత తాజాగా ఖమేనీ అధికారిక ఎక్స్ ఖాతా నుంచి వచ్చిన ఒక పోస్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇజ్రాయెల్‌ను నేరుగా హెచ్చరిస్తూ చేసిన ఈ పోస్ట్‌లో ఒక ఏఐ ఫోటోను కూడా షేర్ చేశారు. అందులో క్షిపణుల తయారీ నుంచి లక్ష్యాన్ని ధ్వంసం చేసే వరకు ఉన్న ప్రక్రియను చూపించారు.
ఇజ్రాయెల్‌కు ప్రత్యక్ష హెచ్చరిక
ఖమేనీ ఖాతా నుంచి వచ్చిన పోస్ట్‌లో.. "జియోనిస్ట్ పాలన (ఇజ్రాయెల్) చాలా పెద్ద తప్పు చేసింది. దేవుని దయతో దీని పర్యవసానాలు వారిని నిరాశకు గురిచేస్తాయి" అని రాశారు. ఈ పోస్ట్ చూస్తుంటే ఇరాన్ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఇరాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి సయీద్ ఖతీబ్జాదే మాట్లాడుతూ.. అమెరికా, ఇజ్రాయెల్‌తో తమ పోరాటం ఇప్పుడు ఇరాన్ అస్తిత్వ పోరాటంగా మారిందని స్పష్టం చేశారు. చివరి బుల్లెట్ వరకు తాము పోరాడుతామని, ఆక్రమణదారులకు తగిన బుద్ది చెబుతామని ఆయన హెచ్చరించారు.
అమెరికా శిక్ష తప్పించుకోలేదు
శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధనౌకను అమెరికా జలాంతర్గామి ముంచేయడంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. నిరాయుధ నౌకపై దాడి చేసినందుకు అమెరికా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఖతీబ్జాదే హెచ్చరించారు. "ఒక దేశాధినేతను ఇలా లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం. ఇదే గనుక కొత్త నిబంధన అయితే ప్రపంచం చాలా ప్రమాదంలో పడుతుంది" అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ తన గ్రేటర్ ఇజ్రాయెల్ భ్రమ కోసం అమెరికన్లను ఈ యుద్ధంలోకి లాగిందని, ఇది కేవలం ఇజ్రాయెల్ స్వార్థం కోసమే జరుగుతోందని ఆయన విమర్శించారు.
ట్రంప్ తీరుపై మండిపాటు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ నాయకత్వాన్ని మార్చాలని చూస్తుండటంపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. "న్యూయార్క్ మేయర్‌ను కూడా ఎన్నుకోలేని వ్యక్తి, ఇరాన్ నాయకత్వం గురించి మాట్లాడుతున్నాడు. అతను తన దేశంలో ప్రజాస్వామ్యం కోరుకుంటాడు కానీ విదేశాల్లో ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చాలని చూస్తాడు" అని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయలేదని, అయితే బీమా కంపెనీలు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడకపోవడం వల్లే షిప్పింగ్ ఆగిపోయిందని క్లారిటీ ఇచ్చారు. మొత్తం మీద ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది, ఇది పెద్ద ప్రాంతీయ యుద్ధానికి దారితీసేలా కనిపిస్తోంది.