Lottery Winner : భార్య తిడుతున్నా..15 ఏళ్లుగా కొంటూనే ఉన్నాడు..ఎట్టికేలకు డ్రైవర్‎ని వరించిన రూ.34 కోట్ల లాటరీ

Lottery Winner : షార్జాలో పికప్ డ్రైవర్‌గా పనిచేస్తున్న భారతీయ వ్యక్తి విభీష్, అబుదాబీ బిగ్ టికెట్ లాటరీలో రూ.34 కోట్లు గెలుచుకున్నాడు. 15 ఏళ్ల నిరంతర ప్రయత్నం తర్వాత అతనికి ఈ అదృష్టం వరించింది.

Update: 2026-03-07 03:37 GMT

Indian Driver Wins Lottery

Lottery Winner : అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ ఆ అదృష్టం కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తే ఏదో ఒకరోజు విజయం వరిస్తుందని నిరూపించాడు ఒక భారతీయ డ్రైవర్. దుబాయ్‌లో సామాన్యమైన పికప్ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తిని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది బిగ్ టికెట్ లాటరీ. గత 15 ఏళ్లుగా నిరంతరం లాటరీ టికెట్లు కొంటూ, ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న అతనికి ఇప్పుడు కాలం కలిసొచ్చింది. కేరళకు చెందిన విభీష్ పల్లియాలి గత 15 సంవత్సరాలుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జాలో ఒక ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ప్రతి నెల తన సంపాదనలో కొంత భాగాన్ని లాటరీ టికెట్ల కోసం ఖర్చు చేసేవాడు. ఎన్నిసార్లు నిరాశ ఎదురైనా అతను ప్రయత్నం ఆపలేదు. తాజాగా అబుదాబీలో నిర్వహించిన బిగ్ టికెట్ లాటరీ డ్రాలో విభీష్ ఏకంగా 15 మిలియన్ దిర్హమ్స్ (సుమారు రూ.34 కోట్లు) గెలుచుకున్నాడు. లాటరీ నిర్వాహకుల నుంచి ఫోన్ వచ్చినప్పుడు అది ఏదో ప్రమోషనల్ కాల్ అని భావించిన విభీష్, అసలు విషయం తెలిసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.

స్నేహితుల ఒత్తిడి.. తగిలిన జాక్‌పాట్

నిజానికి ఈ టికెట్ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఫిబ్రవరి 7న విభీష్ ఇండియాకు వస్తున్న సమయంలో అప్పటికే ఒక టికెట్ కొన్నాడు. అయితే అతని కజిన్, మరో ఇద్దరు స్నేహితులు కలిసి ఇంకో టికెట్ కొనమని ఒత్తిడి చేశారు. అప్పటికే బడ్జెట్ అయిపోయిందని విభీష్ వారించినా, వారు వినలేదు. చివరికి వారి కోరిక మేరకు ఆన్‌లైన్‌లో కొన్న రెండో టికెట్టే అతనికి ఈ భారీ జాక్‌పాట్‌ను తెచ్చిపెట్టింది. ఈ 34 కోట్ల రూపాయలను తన ముగ్గురు స్నేహితులతో పంచుకోవాల్సి ఉంటుంది. అంటే విభీష్ వాటాగా సుమారు రూ.10 కోట్లకు దగ్గరగా నగదు అందుతుంది.

భార్య తిట్టినా వినలేదు.. ఇప్పుడు అంతా హ్యాపీ

ప్రతి నెల టికెట్ల మీద అంత డబ్బు తగలేయడం అవసరమా? అని విభీష్ భార్య తరచూ కోప్పడేదట. కానీ విభీష్ మాత్రం తన నమ్మకాన్ని వదులుకోలేదు. ఇప్పుడు వచ్చిన ఈ భారీ సొమ్ముతో తన కష్టాలన్నీ తీరిపోయాయని అతను సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం బెంగళూరులో చదువుకుంటున్న తన కుమార్తె వందన భవిష్యత్తు కోసం, ఆమె ఉన్నత చదువుల కోసం ఈ డబ్బును ఉపయోగిస్తానని చెప్పాడు.

ఇక సొంత గూటికి పయనం

15 ఏళ్ల పాటు పరాయి దేశంలో డ్రైవర్‌గా కష్టపడిన విభీష్, ఇప్పుడు తన ఉద్యోగానికి స్వస్తి చెప్పి భారత్‌కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు. తన సొంత ఊరిలో సెటిల్ అయ్యి, కుటుంబంతో ప్రశాంతంగా గడపాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. పట్టుదల ఉంటే అదృష్టం కూడా ఏదో ఒకరోజు దాసోహం అంటుందని విభీష్ కథ మరోసారి నిరూపించింది.

Tags:    

Similar News