Donald Trump: భారత్‌పై మరో విడత సుంకాలు తప్పవా.. ట్రంప్ తాజా వ్యాఖ్యల ఆంతర్యం ఇదేనా?
Donald Trump: భారత్ మీద మరో విడత సుంకాల వడ్డన తప్పదా? అమెరికా అధ్యక్షుని తాజా మాటల్లో ఇదే స్పష్టమవుతోంది.
Donald Trump: భారత్‌పై మరో విడత సుంకాలు తప్పవా.. ట్రంప్ తాజా వ్యాఖ్యల ఆంతర్యం ఇదేనా?
Donald Trump: భారత్ మీద మరో విడత సుంకాల వడ్డన తప్పదా? అమెరికా అధ్యక్షుని తాజా మాటల్లో ఇదే స్పష్టమవుతోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై రెండోదశ ఆంక్షలను విధించబోతోన్నట్లు చెప్పారు ట్రంప్. ఇదే విషయాన్ని యూస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ కూడా నిర్దారించారు. కాగా భారత్ మీద సుంకాలను సమర్థించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. రష్యాను కట్టడి చేయాలంటే ఇది తప్పనిసరి అంటున్నారు. కాగా అమెరికా ప్రభుత్వానికి ఇప్పుడు కొత్త భయం పుట్టుకుంది. సుప్రీంకోర్టు ప్రతికూల తీర్పు ఇచ్చే ఇప్పటి దాకా వసూలు చేసిన సుంకాలను తిరిగి చెల్లించక తప్పదనే ఆందోళన మొదలైంది.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై రెండోదశ ఆంక్షలను విధించేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఉక్రెయిన్ మీద రష్యా అతిపెద్ద దాడి జరిపింది. కీవ్‌లోని ఉక్రెయిన్ ప్రభుత్వ కాంప్లెక్స్‌ను రష్యన్ దళాలు ధ్వంసం చేశాయి. ఈ దాడిలో నేపథ్యంలో వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు ట్రంప్. రష్యాతో పాటు ఆ దేశం నుంచి చమురు కొనుగోలు దేశాలపై చర్యలు తీసుకొంటారా..? విలేఖరులు ప్రశ్నించారు. దానికి ఆయన అవును అని సమాధానం ఇచ్చారు. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధంలో సహకరించే వారిపై ఆంక్షలు అమలయ్యేలా చూసే బాధ్యత తమదే అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. ట్రంప్ నేరుగా భారత్ పేరు చెప్పకున్నా, ఇటీవలే ఆయన చేసిన వ్యాఖ‌్యల ప్రకారం భారత్ మీద మరిన్ని ఆంక్షలు ఉంటాయని స్పష్టమైంది. ప్రధాని మోదీని అభినందిస్తూనే రష్యా నుంచి భారత్ ఇంధనం కొనుగోలు చేయడాన్ని తప్పుపట్టడం తెలసిందే..
మరోవైపు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై రెండోవిడత ఆంక్షలు విధించడానికి సిద్ధమవుతున్నట్లు యూస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ వెల్లడించారు. అమెరికా, ఈయూలు జోక్యం చేసుకుని రష్యన్ చమురు కొనుగోలు చేసే దేశాలపై మరిన్ని ఆంక్షలు, ద్వితీయ సుంకాలు విధించగలిగితే రష్యన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతుందని, అప్పుడైనా అధ్యక్షుడు పుతిన్‌ను చర్చలకు వస్తారని స్కాట్ బెసెంట్ వ్యాఖ్యానించారు. కాగా అమెరికా విధించిన సుంకాలను భారత్ అన్యాయమైనవి, అసమంజసమైనవని పేర్కొంది.
ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడు భారత్‌కు వ్యతిరేకంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేసే భారత్ వంటి దేశాలపై ఆంక్షలు విధించడం సరైన నిర్ణయమే అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయానికి మద్దతు ఇచ్చారు. భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీపై అడిగిన ప్రశ్నకు జెలెన్‌స్కీ సమాధానం ఇస్తూ.. రష్యాతో వ్యాపార లావాదేవీలు చేస్తున్న దేశాలపై టారిఫ్‌లు విధించడం సరైన చర్యే. రష్యాను కట్టడి చేయాలంటే సుంకాలు అవసరం అని చెప్పుకొచ్చారు.
వాస్తవానికి రష్యా, ఉక్రెయిన్ల మధ్య సంధి కుదిర్చేందుకు భారత్ దౌత్య యత్నాలు చేస్తున్నా జెలెన్‌స్కీ నుంచి ఇటువంటి వ్యాఖ్యలు రావడం ఆశ్యర్యం కలిగిస్తోంది. ఇటీవల కాలంలో ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధాన్ని ముగించాలని మన దేశం ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాని మోదీ అటు పుతిన్, ఇటు జెలెన్‌స్కీతో చర్చలు జరుపుతున్నారు. గత నెల రెండో వారంలో పుతిన్‌తో భేటీకి ముందు ఉక్రెయిన్ అధినేతతో మాట్లాడారు. ఈ వివాదాన్ని వీలైనంత త్వరగా, శాంతియుతంగా పరిష్కరించడంపై భారత్ స్థిరమైన వైఖరి గురించి తెలియజేశారు. యుద్ధం ముగింపు విషయంలో సాధ్యమైన సహకారాన్ని అందించేందుకు, ఉక్రెయిన్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు
మరోవైపు అమెరికా సర్కారుకు కొత్త ఆందోళన మొదలైంది. ట్రంప్ విధించిన సుంకాల విషయంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తీర్పు వస్తే.. ఇప్పటి వరకు వచ్చిన బిలియన్ డాలర్ల ఆదాయం రీఫండ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ వెల్లడిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.
కోర్టు తీర్పును ట్రంప్‌కు అనుకూలంగా వస్తే మంచిదే. ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే మాత్రం.. మేము దాదాపు సగం సుంకాలకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇది అమెరికా ట్రెజరీకి భయంకరంగా మారుతుంది. తిరిగి చెల్లింపులను జారీ చేయడానికి పరిపాలన సిద్ధంగా ఉందా లేదా? అనేది తేలాలి. అదే జరిగితే పలు దేశాల నుంచి ముక్కు పిండి వసూలు చేసిందంతా అమెరికా కక్కాల్సి ఉంటుంది. అయితే, సుప్రీంకోర్టులో ట్రంప్ అనుకూల తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇక, 1977 అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం - IEEPA కింద ట్రంప్‌కు భారీ సుంకాలను విధించే అధికారం లేదని రెండు ఫెడరల్ కోర్టులు తేల్చిన తర్వాత బెసెంట్ ఇలా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
అయితే.. ట్రంప్ కార్యవర్గానికి అప్పీల్ చేసుకొనేందుకు సమయం ఇస్తూ.. అక్టోబర్ 14వ తేదీ వరకు ఈ ఆదేశాలను నిలిపివేసింది. ఈనేపథ్యంలో ట్రంప్ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కొత్త టారిఫ్‌లు అమల్లోకి వచ్చిన నాటినుంచి కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం 70 బిలియన్ డాలర్లను వసూలుచేసింది. ఈ ఏడాది వసూలైన మొత్తం 180 బిలియన్ డాలర్లలో సగం కంటే ఇది తక్కువ. తాజాగా సుప్రీంకోర్టులో కేసు 2026 సంవత్సరం మధ్య వరకు కొనసాగి ప్రతికూల తీర్పు వస్తే.. అమెరికా ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం 750 బిలియన్ డాలర్ల నుంచి 1 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ అంచనా వేశారు. ఇది అమెరికా ఆర్థిక పరిస్థితిని ఇబ్బంది పెడుతుందని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మన దేశంలోని కొన్ని వర్గాలను లక్ష్యం చేసుకొని చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని సోషల్ మీడియా X ‘ఫ్యాక్ట్ చెక్’ చేసి చెప్పింది.రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోంది ఇంధన భద్రత కోసమేనని పేర్కొంది. ఆ దేశం ఎలాంటి ఆంక్షలను ఉల్లంఘించడంలేదని స్పష్టం చేసింది. యూఎస్ కూడా రష్యా నుంచి వస్తువులు దిగుమతి చేసుకుంటున్న విషయాన్నీ ప్రస్తావించింది. నవారో వ్యాఖ్యలు కపటమైనవిగా పేర్కొంది.
ఈ విషయంపై ‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. ఎవరు తప్పు చేసినా ఎక్స్ కమ్యూనిటీ నోట్స్ సరిచేస్తుందని తెలిపారు. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదని ప్రపంచ స్పష్టం చేశారు. సోషల్ మీడియా గ్రోక్ మరింత వాస్తవ తనిఖీలను వినియోగదారులకు అందిస్తుందన్నారు. ఈ ఫ్యాక్ట్ చెక్‌పై నవారో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాన్ మస్క్ పై కూడా ఆయన విరుచుకుపడ్డారు. ‘ఎక్స్’ నిర్వహించిన ఫ్యాక్ట్ చెక్ ఒక చెత్తగా అభివర్ణించారు.
ట్రంప్ విధించిన టారిఫ్‌లను కొందరు అమెరికా విశ్లేషకులు తప్పుపట్టగా.. పీటర్ నవారో, బెసెంట్ వంటి వారు మాత్రం భారత్‌ను ఉద్దేశిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకొని నవారో ఇటీవల చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ఆయన మాటలు తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది.
మరోవైపు ట్రంప్ సుంకాల భారం భారత్ మీద ఏమేరకు ఉండొచ్చు అనే చర్చ జరుగుతోంది.అమెరికా నుంచి వ్యవసాయ, అనుబంధ ఉత్పత్తుల దిగుమతులకు రెండు మూడేళ్లుగా భారత్ కొన్ని సడలింపులు ఇచ్చింది. పూర్తిగా గేట్లు ఎత్తేయాలన్నది ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరిక. ఇది జరిగితే భారత వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్తుంది.
మన ఎగుమతుల్లో అమెరికాకు 30 శాతం వరకు వెళ్తాయి. 2024 లెక్కల ప్రకారం సుమారు 90 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను ఎగుమతి చేశాం. ఇందులో 30 శాతం సుంకాలు లేనివి ఉన్నాయి. మిగిలిన 70 శాతం ఎగుమతుల విలువ 60 బిలియన్ డాలర్లు. ఇందులో 30 శాతానికి పైగా సముద్ర ఉత్పత్తులున్నాయి. ఈ ఉత్పత్తుల్లో రొయ్యలు ఎక్కువ. కోస్తాంధ్ర నుంచి చాలా ఎక్కువగా వెళ్తాయి. ఇప్పటివరకు ఉన్నది, తాజాగా విధించిన 50 శాతం సుంకంతో కలిపి రొయ్యలపై సుమారు 60 శాతం పడుతుంది.
ట్రంప్ తాజా నిర్ణయంవల్ల రొయ్య రైతులకు, ప్రాసెసింగ్ యూనిట్లకు భారీగా నష్టం వాటిల్లుతుంది. ప్రాసెసింగ్ యూనిట్లలో కార్మికుల ఉపాధి అవకాశాలు కూడా దెబ్బతింటాయి.