Dubai Millionaires : దుబాయ్ నుంచి కుబేరుల పరార్..యుద్ధ భయంతో విదేశాలకు 1000 మిలియనీర్ కుటుంబాలు
Dubai Millionaires : ఇరాన్ దాడుల భయంతో దుబాయ్ నుంచి దాదాపు 1000 మిలియనీర్ కుటుంబాలు మస్కట్ మీదుగా ఐరోపాకు వలస వెళ్తున్నాయి. ప్రైవేట్ జెట్ టికెట్ ధరలు రూ.16 లక్షలు దాటడం గమనార్హం.
1000 Millionaires Flee as Iran War Tension Escalates
Dubai Millionaires : మధ్యప్రాచ్యంలో ఇరాన్ దాడులు, యుద్ధ ఉద్రిక్తతలు గల్ఫ్ దేశాల్లో పెను కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా విలాసవంతమైన జీవితానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దుబాయ్ నుంచి సంపన్నులు భారీగా వలస వెళ్తున్నారు. ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం.. యుద్ధ భయంతో దుబాయ్‌ను వీడుతున్న కుబేరులకు ఇప్పుడు ఒమన్ రాజధాని మస్కట్ ప్రధాన మార్గంగా మారింది. ప్రతిరోజూ మస్కట్ ఎయిర్ పోర్టు నుంచి సుమారు 30 ప్రైవేట్ జెట్లు, చార్టర్డ్ విమానాలు గాల్లోకి ఎగురుతున్నాయి. ఒక్కో విమానంలో కనీసం 8 మంది ప్రయాణిస్తూ.. ఇస్తాంబుల్, కైరో మీదుగా లండన్, ఐరోపా నగరాలకు తరలిపోతున్నారు.
వేల సంఖ్యలో సంపన్న కుటుంబాల పలాయనం
ఇరాన్ దాడులు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 1000 మంది మిలియనీర్ల కుటుంబాలు దుబాయ్‌ను వదిలి వెళ్లినట్లు సమాచారం. దుబాయ్‌లో సుమారు 81,200 మంది మిలియనీర్లు నివసిస్తున్నారు, కాబట్టి ఈ స్థాయి వలసలు ఆ నగరంపై ఆర్థికంగా పెద్ద ప్రభావాన్నే చూపేలా ఉన్నాయి. మస్కట్ విమానాశ్రయంలో రద్దీ ఎంతలా పెరిగిందంటే.. గత వారంలో అక్కడ నడిచిన విమానాల్లో మూడో వంతు కేవలం ప్రైవేట్ జెట్లే ఉండటం గమనార్హం. పరిస్థితిని అదుపు చేయడానికి ఎయిర్‌పోర్ట్ అధికారులు కొత్త చార్టర్డ్ విమానాలకు అనుమతులు నిరాకరిస్తున్నారు.
పెంపుడు జంతువులతో సహా ప్రయాణం
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతున్న సంపన్నుల కోసం ప్రైవేట్ జెట్లలో ఒక్కో సీటు ధర ఏకంగా 20,000 డాలర్ల (సుమారు రూ.16 లక్షలకు పైగా)కు చేరింది. ఎంత ధరైనా పర్వాలేదని చాలామంది తమ కుటుంబాలతో పాటు పెంపుడు జంతువులను కూడా వెంటబెట్టుకుని ఐరోపాకు చెక్కేస్తున్నారు. మస్కట్‌లో రద్దీ వల్ల కొందరు రియాద్, దమ్మామ్ విమానాశ్రయాలను వాడుకుంటుండగా.. మరికొందరు ఆసియా నుంచి అమెరికా మీదుగా యూరప్‌కు చేరుకుంటున్నారు. ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా ఎయిర్ ఇండియా కూడా లండన్, పారిస్, న్యూయార్క్ వంటి నగరాలకు అదనపు విమానాలను ప్రకటించింది.
గాల్లోనూ యుద్ధ విమానాల పహారా
దుబాయ్ విమానాశ్రయం అప్పుడప్పుడు మూతపడుతుండటంతో విమాన ప్రయాణాలు కష్టతరంగా మారాయి. ప్రస్తుతం దుబాయ్ నుంచి బయలుదేరే విమానాలు ఒక ఇరుకైన ఎయిర్ కారిడార్ ద్వారా దక్షిణ దిశగా వెళ్తున్నాయి. వీటికి రక్షణగా యూఏఈ సైనిక యుద్ధ విమానాలు కాపలాగా ఉంటున్నాయి. బ్రిటిష్ ఎయిర్‌వేస్, ఎయిర్ ఫ్రాన్స్ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పటికే తమ సర్వీసులను రద్దు చేశాయి లేదా దారి మళ్లించాయి. మొత్తానికి యుద్ధ మేఘాలు గల్ఫ్ సామ్రాజ్యాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.