Donald Trump : ఇరాన్ కథ ముగిసినట్టేనా? యుద్ధంపై డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Donald Trump : ఇరాన్‌తో యుద్ధం త్వరలోనే ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ సైన్యం, నౌకాదళం ధ్వంసమయ్యాయని, చమురు ధరలు త్వరలో తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు.
Trump Signals End of Iran War
Donald Trump : మధ్యప్రాచ్యంలో రగులుతున్న యుద్ధ జ్వాలలకు త్వరలోనే ముగింపు పడబోతోందా? అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాటలు వింటే అవుననే అనిపిస్తోంది. ఇరాన్‌తో జరుగుతున్న పోరు చివరి దశకు చేరుకుందని, చాలా త్వరలోనే యుద్ధం ముగిసిపోతుందని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. ఫ్లోరిడాలో జరిగిన ఒక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "మేము ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు చాలా దగ్గరలో ఉన్నాం. ప్రపంచాన్ని బందీగా మార్చాలని చూసే ఏ ఉగ్రవాద పాలనను మేము సహించబోము" అని కుండబద్దలు కొట్టారు. ట్రంప్ చేసిన ఈ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా పడిపోవడం విశేషం.
ఇరాన్ కోలుకోలేని దెబ్బ.. ట్రంప్ హెచ్చరిక
ఇరాన్ సైన్యం దాదాపుగా నాశనమైపోయిందని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ డ్రోన్, క్షిపణి వ్యవస్థలను అమెరికా, ఇజ్రాయెల్ దళాలు పూర్తిగా ధ్వంసం చేశాయని ఆయన పేర్కొన్నారు. "ఇరాన్ నావికాదళం ఇప్పుడు సముద్ర గర్భంలో ఉంది. మేము వారి 46 యుద్ధ నౌకలను నాశనం చేశాం. వారి ఉగ్రవాద నాయకులు మరణించారు" అని ట్రంప్ వివరించారు. ఒకవేళ ఇరాన్ ఇంకా మొండిగా వ్యవహరిస్తే, ఆ దేశంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామని, అదే జరిగితే ఇరాన్ మళ్ళీ కోలుకోవడానికి దశాబ్దాల సమయం పడుతుందని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
చమురు సరఫరాపై నిఘా - సామాన్యులకు ఊరట
ప్రపంచ చమురు సరఫరాను అడ్డుకోవాలని చూస్తే ఇరాన్‌కు కఠినమైన శిక్ష తప్పదని ట్రంప్ హెచ్చరించారు. ప్రస్తుతం అమెరికా నౌకాదళం చమురు ట్యాంకర్లకు రక్షణగా ఉందని, ఏ అడ్డంకులు లేకుండా చమురు రవాణా జరిగేలా చూస్తామని చెప్పారు. దీనివల్ల రాబోయే రోజుల్లో చమురు ధరలు భారీగా తగ్గుతాయని, అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్లోని సామాన్య కుటుంబాలకు గ్యాస్, పెట్రోల్ భారమ్ తగ్గుతుందని ఆయన భరోసా ఇచ్చారు. అంతేకాకుండా, ఇరాన్ తదుపరి నాయకుడి ఎంపికలో కూడా అమెరికా పాత్ర ఉండాలని తాను కోరుకుంటున్నట్లు ట్రంప్ బాంబు పేల్చారు.
శాంతి దిశగా అడుగులు - పుతిన్ మధ్యవర్తిత్వం
ఇరాన్-అమెరికా యుద్ధం ముగింపునకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ట్రంప్‌తో పుతిన్ జరిపిన చర్చల్లో యుద్ధ విరమణ అంశం ప్రధానంగా వచ్చినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌ను అంతం చేయాలన్న ఇరాన్ ప్లాన్‌ను తాము సరైన సమయంలో అడ్డుకున్నామని ట్రంప్ గర్వంగా చెప్పుకొచ్చారు. "మేము మానవ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన దేశం.. పిచ్చివాళ్ళు, ఉగ్రవాదుల వల్ల మాకు ముప్పు పొంచి ఉండటాన్ని మేము ఏమాత్రం సహించం" అని ట్రంప్ తన ప్రసంగాన్ని ముగించారు.