అధికారుల నిర్వాకం: భర్తను మార్చిన అధికారులు, సంసారంలో చిచ్చు

Update: 2018-08-20 04:06 GMT

తన అనుమతి లేకుండా ప్రభుత్వ ప్రకటనలో ఫొటోలు ప్రచురించడమే కాకుండా తన భర్త ఫొటోనుకూడా మార్చి వేశారని నాయకుల పద్మ అనే బాధితురాలు వాపోయారు. కంటి వెలుగు కార్యక్రమం ప్రకటనలో వేరొకరి భార్యగా చూపించి తమ పరువు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రైతుబీమా, కంటివెలుగు పథకాలకు సంబంధించి ఇటీవల ఇచ్చిన పత్రికా ప్రకటనల్లో తప్పిదాలు చోటుచేసుకోవడం, అవి సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో బాధిత కుటుంబం ఆదివారం భట్టి విక్రమార్కకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన ఆదివారం బాధిత కుటుంబంతో కలిసి ఖమ్మం జిల్లా మధిరలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
 
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన నాయకుల నాగరాజు, పద్మ దంపతులు బొంతలు కుట్టుకుంటూ జీవిస్తుంటారని, కొందరు అధికారులు వీరి వద్దకు వచ్చి ప్రభుత్వ లెక్కల కోసమని మాట్లాడి ఫొటోలు తీసుకున్నారని భట్టి చెప్పారు. వారికి లోన్‌ ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్పి.. వారి ఫొటోలను మరో విధంగా వాడుకున్నారని తెలిపారు. నాగరాజుకు రైతుబీమా పథకాన్ని అమలు చేసినట్లు ఫొటో వేశారని, కానీ, వీరికి అసలు వ్యవసాయ భూమే లేదని తెలిపారు. ఆ తర్వాత ‘కంటి వెలుగు’ పథకంలోనూ వీరి ఫొటోలను వినియోగించారని, అయితే.. భార్య ఫొటో పక్కన భర్తగా వేరే వ్యక్తి ఫొటోను ఉంచారని, ఈ ప్రకటనలు వార్తా పత్రికల్లోనూ, ఎక్కడ పడితే అక్కడ ప్రచారం కావడంతో ఆ పేద కుటుంబంలో కలతలు రేగాయన్నారు. బాధితురాలికి న్యాయం జరిగేంత వరకూ కాంగ్రెస్‌ పోరాడుతుందని తెలిపారు. అయితే, ప్రకటనల్లో దంపతుల ఫొటో మారడం వివాదానికి దారితీయడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

ఈ ప్రకటనను చూసి ప్రతి ఒక్కరూ గేలిచేసి మాట్లాడుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు బాధితురాలు పద్మ . అత్తమామలు, గ్రామస్తుల సూటి పోటి మాటలతో తలెత్తుకు తిరుగలేకపోతున్నానని వాపోయారు. ఆమె భర్త నాగరాజు మాట్లాడుతూ.. తాను అసలు మందే తాగనని, కాపుసారా కాయనని తెలిపారు. తమకు పొలంకూడా లేదని, కేవలం రేషన్, ఆధార్‌ కార్డులే ఉన్నాయని, సెంటు భూమీ లేకపోయినా రైతుబంధు చెక్కులు అందుకున్నట్లుగా ప్రకటన వేశారన్నారు. తన భార్య పక్కన మరొక వ్యక్తి ఫొటోను ఉంచి కంటి వెలుగు ప్రకటనలో చూపించారని నాగరాజు ఆరోపించారు. 

Similar News