ఎన్నికలకు ఆరునెలల ముందు ఏపీలో రాజకీయం అనూహ్య మలుపులు

Update: 2018-10-23 07:00 GMT

ఎన్నికలకు ఆరునెలల ముందు ఏపీలో రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతోంది. మొన్నటి వరకూ మిత్రులు ఇప్పుడు శత్రువుల్లా బరిలోకి దిగుతున్నారు టిడిపితో తెగతెంపులు చేసుకున్న జనసేన పయనం ఎటు? ఎవరితోచేయి కలుపుతుంది? ఇప్పుడిదే సస్పెన్స్.. టిడిపితో తమ స్నేహం ముగిసిపోయిన బంధమని ఇక జనసేన లెఫ్ట్ పార్టీలతో బరిలోకి దిగుతుందని పవన్ ప్రకటించారు హంగ్ వస్తే తామే కింగ్ అని పవన్ అనుకుంటున్నా తప్పని పరిస్థితుల్లో అవసరమైతే జగన్ కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమేనని అంతరంగికుల ద్వారా సంకేతాలు పంపినట్లు రాజకీయ వర్గాల్లో ఆ మధ్య చర్చ జరిగింది. కానీ పవన్ ప్రతిపాదనను జగన్ అంతగా విశ్వసించడం లేదని తెలుస్తోంది.

జనసేన, టిడిపి ఇప్పుడు శతృ పక్షాలేనని వారు చెబుతున్నా ఇద్దరూ ఒకరికొకరు రహస్య మిత్రులని బలంగా నమ్ముతోంది వైసిపి పవన్ ఇంకా టిడిపి వెంటే ఉన్నారని వైసిపి ఓటు బ్యాంకును కొల్లగొట్టి టిడిపికి మేలు చేయడమే ఆయన ఉద్దేశమని వైసిపి నేతల అనుమానం ఇలాంటి సమయంలో గెలుపు, ఓటములను ప్రభావితం చేసే కాపు ఓట్లు ఈసారి ఎవరి ఖాతాలోకి వెళ్లబోతున్నాయన్నదే అందరికీ కలుగుతున్న సందేహం. గత ఎన్నికల్లో టిడిపి గెలుపును నిర్దేశించిన కాపు ఓటు బ్యాంకును ఎలాగైనా తన గుప్పిట్లో పెట్టుకోవాలని పవన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గతంలో జగన్ పాదయాత్ర సమయంలో ఎక్కువ సమయం ఉభయ గోదావరి జిల్లాలపైనే దృష్టి పెట్టారు. ఏకంగా 22 రోజులకు పైగానే ఆయన ఈ జిల్లాల్లో కలియ తిరిగారు అసలు రాజమండ్రిలోకి జగన్ ఎంట్రీయే అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేసేసింది.

కీలకమైన కాపు రిజర్వేషన్ల తేనెతుట్టను కదిపారు అది కేంద్ర పరిధిలో ఉందని కుండ బద్దలు కొట్టారు. దాంతో మొన్నటి వరకూ జగన్ కు అనుకూలంగా ఉన్న కాపు ఓటు బ్యాంకులో పెద్ద కుదుపు వచ్చింది. కొందరు జగన్ పై బాహాటంగా తిరగబడినా ఆ తర్వాత వాస్తవాలు తెలుసుకుని సైలెంట్ అయ్యారు. చేసే హామీలే ఇస్తానని చేయలేనివి చెప్పనని జగన్ క్లారిటీ ఇవ్వడంతో కాపు నేతల్లోనే ఆయనపై ఒక స్పష్టత వచ్చింది. కొంత చిత్తశుద్ధి గల నేత అన్న భావన కలిగింది. అదే సమయంలో కాపులకు జగన్ మొండి చేయి చూపాడంటూ చంద్రబాబు విమర్శల వేడి పెంచారు వీరిద్దరి సంగతి ఇలా ఉండగానే జనసేన అధినేత పవన్ గోదావరి జిల్లాల్లో ఎంటరయ్యారు. అదీ సేమ్ టు సేమ్ వైసిపి అధినేత ఎంటరైన స్టైల్ లోనే పవన్ కూడా కవాతు జరిపారు జగన్ కన్నా ఎక్కువ సమయం ఆ జిల్లాల్లో తిష్ట వేశారు. కాపు రిజర్వేషన్ల విషయంపై జగన్ వైఖరిని విమర్శించారు తప్ప తానేం చేస్తారో చెప్పలేకపోయారు.

ఇలా పవన్ జగన్ వెనక షాడోలా ఫాలో అయ్యారు. ఎన్నికల నాటికి వైసిపి, జనసేన కలుస్తాయని టిడిపి ఆరోపిస్తోంది. ఈ మధ్య కాలంలో టిడిపిపై పవన్ దూకుడు పెంచారు. అవినీతి ఆరోపణలతో చెలరేగిపోయారు. గత ఎన్నికల్లో టిడిపి, వైసిపి మధ్య తేడా రెండు శాతం ఓట్లు మాత్రమే అదీ గోదావరి జిల్లాల్లో కాపు కులస్తుల ఓట్లే కీలకమైన ఈ ఓట్లన్నీ ఇప్పుడు జనసేన గెలుచుకుంటుందనే అంచనాలలో వైసిపి ఉంది. అలాంటప్పుడు ఆ ఓట్లపై కన్నేసి పోటీ పడటం కన్నా కాపు రిజర్వేషన్లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బిసీలను టార్గెట్ చేయడమే మంచిదని వైసీపీ నమ్ముతోంది. అందుకే జగన్ తన పాదయాత్ర తర్వాత బిసీ డిక్లరేషన్ ప్రకటిస్తారని వైసిపి శ్రేణులు అంటున్నాయి.

టిడిపిపై ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత, పాలనపరంగా వైఫల్యం, అవినీతి తమ గెలుపుకు సోపానాలవుతాయని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. కాపుల ఓట్ల కోసం పాకులాడేకన్నా కీలకమైన బీసీ ఓట్లను, ఇతర అగ్రకులాల ఓట్లను తమ వైపు తిప్పుకోవడమే బెటర్ అనే ఆలోచనలో జగన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో టిడిపి వెంట నిలిచిన బ్రాహ్మణులు, వైశ్యులు, రాజులు ఈసారి తమ వెంట నిలుస్తారని జగన్ నమ్ముతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే జనసేన ప్రతిపాదన పట్ల విముఖంగా ఉన్నట్లు సమాచారం. ఇంతకీ జగన్ వ్యూహం ఫలిస్తుందా? 2019 ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలొచ్చినా.. అది జగన్ స్వయం కృతమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు వైసీపీ నేతలు మాత్రం ఈసారి గెలుపు మాదేననే ధీమాలో ఉన్నారు.
 

Similar News