29 నుంచి శ్రీకపిలేశ్వరాలయంలో తెప్పోత్సవాలు

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల 29 నుండి జ‌న‌వ‌రి 2వ తేదీ వరకు తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి.

Update: 2025-12-18 11:41 GMT

తిరుపతి: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల 29 నుండి జ‌న‌వ‌రి 2వ తేదీ వరకు తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఐదు రోజులపాటు జరిగే తెప్పోత్సవాలలో మొదటిరోజైన 29వ తేదీన శ్రీ వినాయక స్వామివారు, శ్రీ చంద్ర‌శేఖ‌ర్ స్వామివారు పుష్కరిణిలో 9 చుట్లు విహరిస్తారు. న‌వంబ‌రు 30న శ్రీ వ‌ళ్ళి దేవ‌సేన స‌మేత శ్రీ సుబ్రమణ్యస్వామివారు 9 చుట్లు, డిసెంబ‌రు 31న‌ శ్రీ సోమస్కందస్వామివారు 9 చుట్లు, జ‌న‌వ‌రి 1న‌ శ్రీ కామాక్షి అమ్మవారు 9 చుట్లు, జ‌న‌వ‌రి 2న‌ శ్రీ చండికేశ్వరస్వామివారు మ‌రియు శ్రీ చంద్రశేఖర స్వామివారు తెప్పలపై 9 చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిస్తారు.

ప్రతిరోజూ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు ఊంజ‌ల సేవ‌, తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. జనవరి 3వ తేదీన ఆరుద్ర దర్శన మహోత్సవం సందర్భంగా ఉదయం 6 నుండి రాత్రి 9 గంటల వరకు శ్రీ నటరాజస్వామివారు, శ్రీ శివగామి అమ్మవారు, శ్రీ మాణిక్యవాసగ స్వామివారి ఉత్సవ విగ్రహాలను పురవీధులలో ఊరేగించనున్నారు. తెప్పోత్సవాల సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంకీర్తనలు ఆలపిస్తారు.

టీటీడీకి రూ.1.20 కోట్లు విలువైన బ్లేడ్లు విరాళం

హైదరాబాద్ కు చెందిన వర్టీస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ శ్రీధర్ బోడుపల్లి బుధవారం టీటీడీకి ఏడాదికి సరిపడా రూ.1.20 కోట్లు విలువైన సిల్వర్ మాక్స్ హాఫ్ బ్లేడ్లలను విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు బ్లేడ్లను అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, భక్తులు తలనీలాలు సమర్పించేందుకు బ్లేడ్ల కోసం టీటీడీ ఏడాదికి రూ.1.16 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. రోజుకు 40 వేల హాఫ్ బ్లేడ్లను కల్యాణకట్టల్లో వినియోగిస్తున్నామన్నారు. ఒక ఏడాదికి టీటీడీకి సరిపడా బ్లేడ్లను విరాళం ఇచ్చేందుకు ముందుకు రావడం గొప్ప విషయమని దాతను చైర్మన్ అభినందించారు.

ఈ సందర్భంగా దాత శ్రీధర్ బోడుపల్లి మాట్లాడుతూ, వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా హాఫ్ బ్లేడ్లను అందుబాటులోకి తీసుకువచ్చిన సంస్థ తమదేనని అన్నారు. ఈ హాఫ్ బ్లేడ్ల వల్ల కల్యాణకట్టలో భక్తులకు తలనీలాలు తీసేందుకు క్షురకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తమ సంస్థ తయారు చేసిన బ్లేడ్లకు యూరప్, అమెరికాతో సహా 52 దేశాల్లో మంచి డిమాండ్ ఉందన్నారు. 7′ఓ క్లాక్ సంస్థ బ్లేడ్లను కూడా తామే ఉత్పత్తి చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కల్యాణకట్ట ఏఈఓ శ్రీ రమాకాంత్ పాల్గొన్నారు.

Tags:    

Similar News