Jogi Ramesh: నాకు ఏదైనా జరిగితే లోకేశ్ దే బాధ్యత
Jogi Ramesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేశ్‌లపై మాజీ మంత్రి జోగి రమేష్ మరోసారి నిప్పులు చెరిగారు.
Jogi Ramesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేశ్‌లపై మాజీ మంత్రి జోగి రమేష్ మరోసారి నిప్పులు చెరిగారు. తనపై జరుగుతున్న దాడులు, అక్రమ కేసులపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "నన్ను 83 రోజులు జైల్లో పెట్టినా మీ కడుపు మంట చల్లారలేదా చంద్రబాబూ?" అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు.
రెడ్ బుక్ మడిచి పెట్టుకో.. లోకేశ్‌కు వార్నింగ్! నారా లోకేశ్ ఆదేశాలతోనే తన ఇంటిపై దాడి జరిగిందని జోగి రమేష్ ఆరోపించారు. ఈ సందర్భంగా లోకేశ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. "నీ రెడ్ బుక్ తీసి మడిచిపెట్టుకో" అని ఘాటుగా వ్యాఖ్యానించారు. తనను అంతం చేయాలనే కుట్ర జరుగుతోందని, తనకు ఏమైనా జరిగితే దానికి నారా లోకేశ్‌దే పూర్తి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.
దాడి వెనుక 'బ్లేడ్ బ్యాచ్' కుట్ర? విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లు తన ఇంటిపై దాడికి దిగాయని జోగి రమేష్ ఆరోపించారు.
పోలీసుల తీరుపై మండిపాటు: టీడీపీ గూండాలకు పోలీసులు రక్షణ కల్పిస్తున్నారని, పోలీసుల సమక్షంలోనే తన ఇంటిపై దాడి జరిగిందని దుయ్యబట్టారు. ఆ సమయంలో పోలీసుల చేతుల్లో కనీసం లాఠీలు కూడా లేవని, ఇది ముందస్తు ప్రణాళికలో భాగమేనని విమర్శించారు.
సోషల్ మీడియా గూండాలు: సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి గూండాలను రప్పించారని, తన ఇల్లు తగలబెట్టి లోకేశ్ దగ్గర మార్కులు కొట్టేయాలని కొందరు చూస్తున్నారని మండిపడ్డారు.
భయపడేది లేదు - పారిపోయేది లేదు! "నేను విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉన్నాను. కేసులకు, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదు" అని జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు. తనకు అండగా వైఎస్ జగన్, వైసీపీ సైన్యం ఉందని.. తాను ఎక్కడికీ పారిపోనని చెప్పారు. కూటమి ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని, రాక్షసానందం పొందుతున్న వారికి త్వరలోనే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.