గోదావరిలో విషాదం.. ఐదుగురు యువకులు గల్లంతు
ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం వేలేరు గ్రామ సమీపంలోని గోదావరి నదిలో స్నానానికి దిగి ఐదుగురు యువకులు గల్లంతయ్యారు.
గోదావరిలో విషాదం.. ఐదుగురు యువకులు గల్లంతు
కుక్కునూరు (ఏలూరు జిల్లా): సరదాగా స్నానానికి దిగిన ఏడుగురు స్నేహితుల్లో ఐదుగురిని గోదావరి మృత్యురూపంలో కబళించింది. ఏలూరు జిల్లా కుక్కునూరు మండల పరిధిలోని వేలేరు గ్రామం వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగి ఐదుగురు యువకులు గల్లంతైన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
అసలేం జరిగిందంటే?
వివరాల ప్రకారం.. ఏడుగురు యువకులు కలిసి భద్రాచలం రామాలయ దర్శనం కోసం వచ్చారు. బుధవారం స్వామివారిని దర్శించుకుని, గురువారం సినిమా చూసి, శుక్రవారం ఉదయం కుక్కునూరు సమీపంలోని వేలేరు వద్ద గోదావరి నదిలోకి స్నానానికి దిగారు. నది లోతు తెలియకపోవడంతో ఐదుగురు ప్రవాహంలో కొట్టుకుపోయారు. వీరిలో దీపక్, హర్షలు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని సురక్షితంగా బయటపడ్డారు.
బాధితుల వివరాలు:
గల్లంతైన వారిలో భద్రాచలం రామాలయ అర్చకుడు శ్రీకర్ తో పాటు, అమరావతి ఎస్ఆర్ఎం (SRM) ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు సతీష్ (మదనపల్లి), అభిరామ్ (విజయనగరం), నవదీప్ (ఉయ్యూరు), తేజ (ఉయ్యూరు) ఉన్నట్లు గుర్తించారు.
గాలింపు చర్యలు:
సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన ముగ్గురి కోసం గాలింపు ముమ్మరంగా కొనసాగుతోంది. చేతికి అందిన కొడుకులు విగతజీవులుగా మారుతుండటంతో తల్లిదండ్రులు, బంధువుల ఆర్తనాదాలతో గోదావరి తీరం మిన్నంటింది.