CM Chandrababu: వైసీపీ ట్రాప్‌లో పడొద్దు.. సంయమనం పాటించండి: టీడీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు!

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో హింసను ప్రేరేపించి, అలజడి సృష్టించేందుకు వైకాపా కుట్రలు చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

Update: 2026-02-02 08:49 GMT

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో హింసను ప్రేరేపించి, అలజడి సృష్టించేందుకు వైకాపా కుట్రలు చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆ పార్టీ నేతలు చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఉచ్చుల్లో చిక్కుకోవద్దని ఆయన టీడీపీ నేతలకు, కార్యకర్తలకు సూచించారు. సోమవారం ఉదయం మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు కీలక దిశానిర్దేశం చేశారు.

అసహనంతోనే వైసీపీ బూతులు: "అధికారం కోల్పోయామనే తీవ్ర అసహనంతోనే వైసీపీ నేతలు బూతులు మాట్లాడుతున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్న మన అజెండా వారికి నచ్చడం లేదు. అందుకే ప్రజలను రెచ్చగొట్టి ప్రశాంతతను దెబ్బతీయాలని చూస్తున్నారు. హింస, విధ్వంసం, అవినీతి పునాదులపై పుట్టిన పార్టీ వైసీపీ. వారి ట్రాప్‌లో పడితే వారికీ, మనకూ తేడా ఉండదు" అని చంద్రబాబు హెచ్చరించారు.

లడ్డూ కల్తీ పాపం నుంచి దృష్టి మళ్లించే కుట్ర: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో వైసీపీ అడ్డంగా దొరికిపోయిందని, రాష్ట్ర ప్రజలంతా ఆ పార్టీని చీదరించుకుంటున్నారని సీఎం అన్నారు. ఆ పాపాల నుంచి, ప్రజల ఆగ్రహం నుంచి తప్పించుకోవడానికి కొత్త వివాదాలను సృష్టించి దృష్టి మళ్లించాలని కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. అయితే, తప్పు చేసిన ప్రతి ఒక్కరినీ చట్టపరంగా శిక్షించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.

నేతలదే బాధ్యత: పార్టీ శ్రేణులు సంయమనం కోల్పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు, సీనియర్ నేతలదేనని చంద్రబాబు ఆదేశించారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌, అనగాని సత్యప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News