నూజివీడు: నూజివీడు మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సెమీ క్రిస్టమస్ కు ప్రత్యేక అతిథిగా హాజరై ఫాదర్స్, మత పెద్దలకు, సోదర, సోదరీ మణులకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి క్రిస్టమస్ శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. మొదటగా మంత్రికి ఘనంగా స్వాగతం పలికి చర్చి ఫాదర్స్, సిస్టర్స్ వాక్యం చదివారు. అనంతరం కేక్ ను కట్ చేసి అందరికీ మంత్రి అందజేశారు. స్నేహ రైట్స్ బి.నగేష్ రావు ఆధ్వర్యంలో 30 మంది నిరుపేదలకు 17 రకాలు నిత్యవసర సరుకులను మంత్రి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ఏసు ప్రభువు త్యాగం, ప్రేమ, కరుణ బోధనలు ద్వారా విశ్వమానవాళికి చక్కని శాంతిమార్గం వేశారన్నారు. మునుపెన్నడు లేని విధంగా క్రిస్టియన్ సోదరులు అభివృద్ధి, సంక్షేమానికి రూ 150 కోట్లు అదనంగా కేటాయించామని అన్నారు. జెరూసలేము యాత్రకు, విదేశీ విద్యను అభ్యచించడానికి ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించామని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అందుకు కావలసిన తన వంతు సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. క్రైస్తవు కుటుంబాలు మంచి ప్రేమ, ఆప్యాయతలు కలవారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. దేవుడు దృష్టిలో మానవులంతా సమానం అని, ఎవరికి కావలసిన అవసరాలు వారికి పుట్టించినప్పుడే వారికి సమృద్ధిగా ఇస్తారని తెలిపారు.
దేవుడి దయతో మాత్రమే ఈ పదవులు, ప్రభుత్వాలు ఏర్పడ్డాయని అన్నారు. దేవుని మార్గంలో నడిస్తే అందరూ ఆరోగ్యంగా, అభివృద్ధి చెందుతారని అన్నారు. అన్ని వర్గాలు ప్రజలకు న్యాయం చేసే ప్రభుత్వాన్ని కూడా ఆశీర్వదించాలని మత పెద్దలను, ఫాదర్స్ లను కోరారు. గతంలో 255 క్రైస్తవ మందిరాలకు బడ్జెట్ కేటాయించిన ప్రభుత్వం కూడా మన ప్రజా ప్రభుత్వమేనని తెలిపారు. గతంలో క్రిస్టియన్ సోదరులకు అనేక అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ఇచ్చింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అని తెలిపారు. ప్రభువు ఆశీస్సులతో రాష్ట్రం, నియోజకవర్గం అంతా ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో జీవించాలని, అందరి జీవితాల్లో చీకటి తొలగిపోయి వెలుగులు నింపాలని, విజయాలు సిద్ధించాలని ఏసు ప్రభువును కోరానని అన్నారు.
ఈ కార్యక్రమంలో చర్చి ఫాదర్లు, సిస్టర్స్, చర్చి పెద్దలు ఇళయరాజా, రమేష్, పట్టణ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, క్రైస్తవ సోదర, సోదరీమణులు పాల్గొన్నారు.