జగన్‌ హత్యాయత్నం కేసులో కీలక మలుపు...షర్ట్ కోసం జగన్‌కు కోర్టు నోటీసులు

Update: 2018-11-19 05:24 GMT

వైసీపీ అధినేత జగన్‌పై హత్యాయత్నం కేసు మరో మలుపు తిరిగింది. దాడి ఘటన నాటి షర్ట్ కోసం జగన్‌కు విశాఖ కోర్టు నోటీసులు జారీ చేసింది. దాడి ఘటన సమయంలో జగన్‌ ధరించిన చొక్కాను ఈ నెల 23లోగా దర్యాప్తు అధికారులకు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. మరి ఆ షర్ట్ జాగ్రత్తగా ఉందా..లేదా అనేది ఇప్పుడు సస్పెన్స్‌ గా మారింది. 

జగన్‌పై జరిగిన కోడికత్తి దాడి కేసు దర్యాప్తులో ఆయన ధరించిన షర్ట్ కీలకమని భావిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఆ చొక్కా కోసం న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. సీఆర్‌పీ సెక్షన్‌ 91 ప్రకారం న్యాయస్థానంలో పిటిషన్‌ వేసింది. దానిపై విచారణ చేపట్టిన విశాఖ ఏడో మెట్రో పాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు రక్తపు మరకలున్న చొక్కాను సమర్పించాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు వైసీపీ అధినేత జగన్‌తో పాటు ఆయన పీఏ నాగేశ్వరరెడ్డికి విశాఖపట్నం న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. దాడి ఘటనలో కీలక సాక్ష్యమైన చొక్కాను ఈనెల 23వ తేదీ ఉదయం 11 గంటలోపు అందజేయాలని జగన్‌ను ఆదేశించింది.

అయితే దాడి జరిగిన సమయంలో జగన్ ధరించిన షర్ట్ ఇప్పుడు ఎక్కడుందనేది ప్రశ్నార్థకంగా మారింది. కత్తి దాడి తర్వాత విశాఖ విమానశ్రయంలోనే ట్రీట్ మెంట్ తీసుకున్న జగన్ వెంటనే హైదరాబాద్ పయనమయ్యారు. దీంతో ట్రీట్ మెంట్ తర్వాత ఆ చొక్కాను భద్ర పరిచారా లేదంటే ఆ హడావిడిలో ఆ షర్ట్ ను అక్కడే వదిలేశారా అనేది అనుమానంగా మారింది. దాడి ఘటనపై మెన్న తొలిసారి స్పందించిన జగన్ ఆ షర్ట్ గురించి ప్రస్తావించడం విశేషం. మరి దాడి ఘటన నాటి రక్తపు మరకలున్న షర్ట్ ఉందా..లేదా..అది కోర్టుకు చేరుతుందా అనేది వేచి చూడాలి.

Similar News