పోలీస్ స్టేషన్‌లో సబ్సిడీ గొర్రెలు

Update: 2017-12-28 07:00 GMT

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సబ్సిడీ గొర్రెల పథకం అమలులో లోపాలు సర్కారు లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నాయి. నిబంధనల్లో లొసుగుల ఆధారంగా దళారులు రీసైక్లింగ్ దందాకు తెర తీశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 350కి పైగా రాయితీ గొర్రెలను పోలీసులు పట్టుకున్నారు. మూడు రోజులుగా స్టేషన్ లోనే ఉంటున్న ఈ గొర్రెలు ఆకలితో అలమటిస్తున్నాయి.

రాష్ట్రంలో రాయితీ గొర్రెల రీసైక్లింగ్ యధేచ్ఛగా సాగుతోంది. సబ్సిడీ గొర్రెలను లబ్ధిదారులు ఎంతకాలం తరువాత అమ్ముకోవచ్చన్న విషయంలో స్పష్టత లేకపోవడంతో దానిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గొర్రెలను తీసుకున్న కొద్ది రోజులకే విక్రయిస్తున్నారు. ఇతర లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు తగినన్ని గొర్రెల లభ్యత లేకపోవడంతో అధికారులు కూడా వీరి దగ్గర కొని పంపిణీ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండల కేంద్రంలోని ఉండవల్లి  టోల్ గేట్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు డిసీఎంలలో తరలిస్తున్న 366 సబ్సిడీ గొర్రెలను పట్టుకున్నారు. అందులో 
180 గొర్రెలు యజమానులవి కానడంతో వారికి అప్పజెప్పారు. మిగిలిన వాటిని స్టేషన్ కు తరలించారు. కాని దళారులు చేసిన తప్పుకు మూగజీవాలు శిక్ష అనుభవిస్తున్నాయి. మూడు రోజులుగా స్టేషన్ లో ఆకలితో అలమటిస్తున్నాయి. పట్టుపడ్డ నిందితులు మాత్రం ద‌ర్జాగా మూడు పూటలా హోటల్లో భుజించారు. మూగజీవాల ఆకలిని దళారులు, అధికారులు మరిచారు. ఆకలితో అలమటించే గొర్రెల అరుపులతో స్టేషన్ లో దద్దరిల్లుతోంది. 

Similar News