గాలి ముద్దుకృష్ణమనాయుడు కన్నుమూత

Update: 2018-02-07 04:54 GMT

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ నాయకునిగా పలు పదవులు చేపట్టిన ఆయన రెండ్రోజులుగా జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మూడు నెలల కిందటే గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న ముద్దుకృష్ణమ.. డెంగ్యూతో బాధపడుతూ రెండు రోజులముందు ఆస్పత్రిలో చేరారు. వైద్యుల ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో చివరికి ఆయన తనువుచాలించారు. ముద్దుకృష్ణమ మరణంతో ఆయన కుటుంబంలో తీవ్రవిషాదం నెలకొంది.

జ్వరంతో బాధపడిన ముద్దుకృష్ణమను కుటుంబీకులు తిరుపతి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ‘‘డెంగ్యూ జ్వరం, బీపీ కంట్రోల్‌ లేని స్థితిలో ఆదివారం ఆయన ఆస్పత్రిలో చేరారు. రెండురోజుల్లోనే మల్టీఆర్గాన్‌ ఫెయిల్యూర్‌ వల్ల పరిస్థితి చేయిదాటిపోయింది’’ అని కేర్‌ వైద్యుడు డాక్టర్‌ కళాధర్‌ తెలిపారు. ముద్దుకృష్ణమ నాయుడి అంత్యక్రియలను ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లాలోని వెంకట్రామాపురంలో నిర్వహించనున్నట్లు కుటుంబీకులు చెప్పారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు ముద్దుకృష్ణమ కుమారుడు జగదీశ్‌, అల్లుడు వంశీలు తెలిపారు.

గాలి ముద్దుకృష్ణమనాయుడు 1947, జూన్‌9న చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురంలో జి.రామానాయుడు, రాజమ్మ దంపతులకు జన్మించారు. బీఎస్సీ, ఎంఏతోపాటు న్యాయవాద డిగ్రీ పట్టా పొందారు. ఆయనకు భార్య సరస్వతి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. విద్యాభ్యాసం తర్వాత అధ్యాపక వృత్తిలోకి ప్రవేశించిన ఆయన.. 1983లో ఎన్టీఆర్‌ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రస్తుతం శాసనమండలిలో సభ్యుడిగా ఉన్నారు. గాలి మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

గాలి ముద్దుకృష్ణమనాయుడు ప్రస్తుతం తిరుపతిలోని పద్మావతిపురంలో ఉంటున్నారు. తాను ప్రాతినిధ్యం వహించిన నగరి నియోజకవర్గ అభివృద్ధి సహా జిల్లా అభివృద్ధికి తనవంతుగా కృషిచేశారు. తెలుగురాష్ట్రాల్లో ఆయన అందరికీ సుపరిచితులు. విపక్షాలపై ధ్వజమెత్తడంలో ఆయనది ప్రత్యేక శైలి. ఆయన మరణంతో తెలుగుదేశం వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి.

ముద్దుకృష్ణమ నాయుడు  పుత్తూరు నుంచి ఆరుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించి రికార్డులకెక్కారు. 1984లో విద్య, 1987లో అటవీశాఖ, 1994లో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా  సేవలందించారు. తెలుగుదేశంతో విభేధించి కాంగ్రెస్‌లో చేరి 2004 ఎన్నికల్లో ఆ పార్టీ శాసనసభ్యునిగా గెలుపొందారు. తిరిగి 2008లో టీడీపీలో చేరి 2009 ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం  టీడీపీ ఎమ్మెల్సీగా సేవలందిస్తున్నారు.

Similar News