సీనియర్ టీడీపీ నేత కుమారుడు వైసీపీలోకి !

Update: 2018-06-29 08:19 GMT

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యర్రా నారాయణస్వామి కుమారుడు నవీన్ వైసీపీలో చేరనున్నారు. వైసీపీ నేత, ఉండి ఎమ్మెల్యే సర్రాజు ఆయనతో జరిపిన మంతనాలు సఫలీకృతమయ్యాయి. పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామని... వైసీపీలోకి రావాలంటూ సర్రాజు ఆహ్వానించడంతో... నవీన్ అంగీకరించారు. త్వరలోనే పార్టీ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. వాస్తవానికి తెలుగుదేశం ఆవిర్భావం నుంచి నారాయణస్వామి రాజకీయ జీవితం గడుపుతున్నారు. అప్ప ట్లోనే జడ్పీ చైర్మన్‌గా ఆయన తిరుగులేని నాయకత్వ పటిమ ప్రదర్శించారు. పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్నందున నారాయణస్వామి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎనలేని గౌరవం. పార్టీపరంగా ఆయనకు బాధ్యతలు అప్పగించాలనుకున్నా వయోభారం అడ్డు తగులుతుందని భావిస్తున్నారు. ఆయన తనయుడు నవీన్‌కు కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చారు. ఆయన పదవీ కాలం ఈ మధ్యనే పూర్తయ్యింది.
 
కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా తనకు అవకాశం ఇవ్వాలని నవీన్‌ పార్టీపై ఒత్తిడి తీసుకువచ్చినా ఫలించలేదు. నారాయణస్వామి స్వయంగా జోక్యం చేసుకుని తన కుమారుడికి ఒక అవకాశం ఇచ్చి తీరాలని పట్టుపట్టినా చైర్మన్‌ పదవి మాత్రం కొత్తపల్లి సుబ్బారాయుడునే వరించింది. జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా ఉన్న యర్రా నారాయణస్వామి గురించి పార్టీలో తెలియని వారు లేరు. ప్రస్తుత జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి ఆయనకు కుమార్తె వరస అవుతారు. ఒక దశలో నారాయణస్వామికి మంచి పదవి లభించేలా సీతారామ లక్ష్మి బాధ్యత భుజానకెత్తుకున్నారు. అప్పట్లోనే ఏదైనా రాష్ట్రానికి గవర్నర్‌ పదవి లభించేలా చూడాలని జిల్లా పార్టీ నాయ కత్వం గట్టిగానే డిమాండ్‌ చేస్తూ వచ్చింది. ఇలాంటి పరిణామాల క్రమంలో తెలుగుదేశంలో మచ్చలేని, తిరుగులేని అత్యంత ప్రతిష్ట కలిగిన తన తండ్రి నారాయణస్వామికి ప్రాధాన్యం లేకపోవడం నవీన్‌ అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలో అసంతృప్తికి గురైన నవీన్... పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చారు.

Similar News