జగన్‌పై దాడి కేసులో సిట్ విచారణ ఆరో రోజు కొనసాగుతోంది. నేటితో నిందితుడు శ్రీనివాసరావు కస్టడీ ముగియనుంది. దీంతో శ్రీనివాసరావు కస్టడీ పొడగింపుపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే శ్రీనివాసరావు నుంచి కీలక విషయాలు రాబట్టిన సిట్ అధికారులు నిందితుడితో కలిసి క్యాంటీన్‌లో పనిచేస్తున్న రమాదేవి, జ్యోతితో పాటు మరో యువతిని విచారించారు. ఇప్పటివరకూ మొత్తం 26మందిని విచారించి సిట్ అధికారులు శ్రీనివాసరావు వినియోగించిన 4సెల్‌ఫోన్లు సీజ్ చేశారు. నిందితుడు శ్రీనివాసరావుకు లై డిటెక్టర్ పరీక్షలు జరిపే యోచనలో సిట్ అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది.
శ్రీనివాస్ సొంతూరు తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలోనూ సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ముమ్మిడివరంలో మరో ఇద్దరిని సిట్ అధికారులు విచారించారు. నిందితుడి లేఖకు సంబంధించి ముమ్మిడివరంలో జిరాక్స్ తీయించిన శ్రీనివాసరావు బంధువు, ఠాణేలంకకు చెందిన జనిపెల్ల దేవసుబ్రహ్మణ్యం, ముమ్మిడివరంలోని శ్రీవాసవీ ఆటోజిరాక్స్ యజమాని అక్షింతల వెంకటరమణను సిట్ ఎస్‌ఐ వెంకట్రావు విచారించారు. గతనెల 16న శ్రీనివాసరావు సూచనల మేరకు ఆ లేఖను ముమ్మిడివరంలో జిరాక్స్ తీయించినట్టు దేవ సుబ్రహ్మణ్యం సిట్ అధికారులకు వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. నిందితుడి స్నేహితుడు, అయినవిల్లి మండలం కొండుకుదురుకు చెందిన దొడ్ల దుర్గాప్రసాద్ హైదరాబాద్‌లో ఉండటంతో ఆ గ్రామానికి వెళ్లి సిట్ అధికారులు ఆరాతీశారు.
ఆరు రోజుల విచారణలో శ్రీనివాసరావు నుండి పలు విషయాలు రాబట్టిన సిట్ అధికారులు కస్టడీని పొడిగించాలని కోర్టును కోరనున్నారు. ఇప్పటి వరకూ జరిపిన విచారణలో కొన్ని ముఖ్యమైన ఆధారాలు లభ్యమయ్యాయని విశాఖ డీసీపీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. దాడికి ఉపయోగించిన కత్తిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని, ఆ రిపోర్టు రావాల్సి ఉందన్నారు. నిందితుడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్టు వైద్యులు ధ్రువీకరించారని డీసీపీ అద్నాన్ నయీం తెలిపారు.