ఎన్నికల హామీని మరచిన మంత్రి మహేందర్ రెడ్డి

Update: 2018-02-23 10:48 GMT

ఏరు దాటి తెప్ప తగలేయడంలో తమను మించినవారు లేరని నిరూపిస్తున్నారు నాయకులు. ఎన్నికలపుడు హామీల వర్షం గుప్పించే నేతలు తీరా గెలిచాకా ఆ ఊసే ఎత్తరు. తమ మంత్రి మహేందర్ రెడ్డి కూడా ఆ తాను ముక్కేనంటున్నారు పాతతాండూర్ పట్టణ వాసులు. గత ఎన్నికల్లో తమకిచ్చిన హామీని మంత్రిగారు నేటికీ నెరవేర్చలేదని నియోజకవర్గప్రజలు వాపోతున్నారు.

వికారాబాద్ జిల్లా తాండూర్ నుంచి పాత తాండూర్ వేళ్లే దారిలో రైల్వే గేటుంది. ఇది ప్రధాన రైల్వే లైను కావటంతో తరచూ రైళ్ల రాకపోకలతో ఎప్పుడూ గేటు పడుతుంది. దీంతో ఆ మార్గంలో వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రోగులు చాలాసేపు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గత ఎన్నికల్లో తాండూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు ప్రస్తుత రవాణా మంత్రి మహేందర్ రెడ్డి. ఆనాడు తన ఎన్నికల హామీల్లో బ్రిడ్జి నిర్మాణం ప్రధానమైనది. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా ఇప్పటి వరకు ఆ హామీ నోటిమాటగానే ఉండిపోయింది.

నియోజకవర్గ ప్రజలనుంచి వచ్చిన ఒత్తిడితో గతేడాది ఫిబ్రవరి 17న బ్రిడ్జి నిర్మాణం కోసం రోడ్లుభవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి హడావిడిగా శంకుస్థాపన చేశారు. శిలాఫలకం వేసి ఏడాది పూర్తయింది తప్ప పనులు మాత్రం ప్రారంభం కాలేదు. వెంటనే బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభించి తొందరగా పూర్తి చేయాలని తాండూర్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. సాక్షాత్తు మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే ఈ పరిస్థితి ఉంటే మిగతా ప్రాంతాల గతేంటని ప్రశ్నిస్తున్నారు.

Similar News