జనసేన పార్టీ తొలి ప్లీనరీ సమావేశానికి రంగం సిద్ధం

Update: 2018-02-20 10:09 GMT

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైసీపీ మధ్య కీలకంగా మారింది పవన్ కల్యాన్ జనసేన పార్టీ. ఈ మధ్యకాలంలో ప్రత్యేకహోదా అంశం జనసేన పార్టీకి మరింత ప్రచారం తీసుకొస్తోంది. ఎన్నికలకు కూడా సమయం దగ్గర పడుతుండటంతో పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు పవన్ కల్యాణ్. త్వరలోనే పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. 

వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాన్.. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడంతోపాటు నెంబర్ షిప్ డ్రైవ్ ను వేగవంతం చేశారు. దీంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో చలోరే చలోరే చల్ పేరుతో  రాజకీయ యాత్రనూ నిర్వహించి కార్యకర్తల్లో ఊపు తెచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్లీనరీ సమావేశాలను కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు నిర్ణయించారు. 

జనసేన పార్టీ ఏర్పాటై నాలుగేళ్లు అవుతున్నా ఇప్పటివరకు ప్లీనరీ సమావేశాలు నిర్వహించలేదు. దీంతో పార్టీ సిద్ధాంతాలను జనంలోకి తీసుకువెళ్లడానికి పార్టీ ఆవిర్భవించిన మార్చి 14నే ప్లీనరీ సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్వహించేందుకు నిర్ణయించారు. గుంటూరు ఆచార్య రంగా యూనివర్సిటీ గ్రౌండ్స్ ను ఈ సమావేశం కోసం పరిశీలిస్తున్నారు. ఇన్నాళ్లూ వన్ మ్యాన్ షో గానే ఉన్న జనసేన పార్టీలో మరికొందరిని కీలకం చేసి పార్టీ అధికార ప్రతినిధులుగా ప్రజలకు పరిచయం చేసేందుకు పవన్ కల్యాన్ ప్లీనరీని వేదికగా చేయనున్నారు. 

Similar News