బీజేపీ స్క్రిప్ట్ ను ఫాలో అవుతున్న ప‌వన్

Update: 2018-03-21 05:28 GMT

పవన్‌ కల్యాణ్‌ వెనుక నిజంగానే ఎవరైనా ఉన్నారా? మొన్నటివరకూ టీడీపీకి అనుకూలంగా మాట్లాడిన జనసేనాని సడన్‌గా యూటర్న్‌ తీసుకోవడంలో ఏదైనా మతలబు ఉందా? హోదా కోసం బలిదానానికైనా సిద్ధమన్న పవన్‌‌ ఇప్పుడు హోదా పెద్ద ఇష్యూ కాదనడం వెనుక కారణమేంటి? టీడీపీ ఆరోపిస్తున్నట్లుగా నిజంగానే పవన్‌ వెనుక బీజేపీ ఉందా?

పవర్‌స్టార్‌ పవన్ కల్యాణ్‌ అరడగుల బుల్లెట్టో కాదో తెలియదు కానీ అతని నోట్లో నుంచి వచ్చే ప్రతీ మాటా తూటాలాగే పేలుతుంది. అంతలా ప్రజల్లో ఇంపాక్ట్‌ చూపిస్తాయి పవన్‌ వ్యాఖ్యలు. అలాంటిది ఏపీతోపాటు పార్లమెంట్‌ను కుదిపేస్తున్న ప్రత్యేక హోదా ఇష్యూపై మాట్లాడాలంటే ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. కానీ ప్రతీ విషయాన్నీ చాలా జాగ్రత్తగా మాట్లాడతాననే పవన్‌ కల్యాణ్‌ అడ్డంగా బుక్కయ్యారు. హోదా సాధన కోసం అవసరమైతే బలిదానానికైనా సిద్ధమన్న జనసేనాని ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా పెద్ద విషయం కానే కాదంటూ చాలా తేలిగ్గా మాట్లాడారు. పేరు ఏదైనా కేంద్రం నుంచి ఆర్ధిక సాయం అందడమే కదా ముఖ్యమంటూ జాతీయ మీడియాతో చెప్పుకొచ్చారు. ఏ పేరైనా పెట్టుకోండి కానీ ఏపీకి నిధులు కావాలి అది ప్యాకేజీ అయినా కావొచ్చంటూ మాట్లాడారు.

అయితే ప్రత్యేక హోదా కోసం అవసరమైతే ఆమరణదీక్ష చేస్తానన్న పవన్‌‌ అంతలోనే ప్రత్యేక హోదా ముఖ్యం కాదని, ప్యాకేజీ ఇచ్చినా చాలంటూ వ్యాఖ్యానించడంతో అందరూ దుమ్మెత్తిపోశారు. దాంతో తేరుకున్న పవన్‌‌ తన మాటల్ని తప్పుగా అర్ధం చేసుకున్నారని, కేవలం నిధులిస్తే సరిపోతుందని తానలా అనలేదంటూ ట్విట్టర్లో వివరణ ఇచ్చారు. చట్టం ప్రకారం రావలసిన నిధులు, ఎక్సైజ్ సుంకం రానప్పుడు స్పెషల్ స్టేటస్‌తో ఉపయోగమేంటని మాత్రమే తాను అన్నానని చెప్పారు. నిధులు, హోదా రెండూ కావాలన్నదే జనసేన డిమాండ్ అంటూ ట్వీట్ చేశారు. 

అయితే తానలా అనలేదంటూ పవన్‌ బుకాయించే ప్రయత్నం చేసినా వీడియో క్లిప్‌ బయటికి రావడంతో జనసేనాని యూటర్న్‌‌పై విమర్శలు చెలరేగుతున్నాయి. హోదా కోసం బలిదానానికైనా సిద్ధమన్న పవన్‌ అంతలోనే మాట మార్చడం వెనుక ఏదో మతలబు ఉందంటున్నారు. ఇక టీడీపీ నేతలైతే పవన్‌‌ వెనుక బీజేపీ ఉందనేది ఈ మాటలతో రుజువైందంటున్నారు.

Similar News