ఏపీ సర్కార్‌కు పవన్ కల్యాణ్ 48 గంటల డెడ్‌లైన్

Update: 2018-05-23 10:49 GMT

ఏపీ ప్రభుత్వానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ 48 గంటల డెడ్‌లైన్ విధించారు. ఉద్దానం కిడ్నీ సమస్యను 48 గంటల్లో చర్యలు తీసుకోకపోతే.. నిరాహారదీక్షకు దిగుతానని అల్టిమేటం జారీ చేశారు. రెండంటే 2 రోజుల్లో.. ఉన్నతస్థాయి కమిటీ వేసి చర్యలు తీసుకోవాలన్నారు. వెంటనే ఆరోగ్యశాఖ మంత్రిని నియమించాలని పవన్ డెడ్ లైన్ పెట్టారు. 

శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న పవన్.. పలాసలో కిడ్నీ బాధితులతో సమావేశమయ్యారు. గతంలోనే ఉద్దానం సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఉద్దానంలో చాలామంది కిడ్నీ బాధితులు ఉండటం బాధాకరమన్నారు. వైద్యనిపుణులు ఇక్కడ వెంటనే డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలిపారు.

గతంలోనూ పవన్ కల్యాణ్ ఉద్దానంలో పర్యటించారు. అప్పుడు అక్కడున్న పరిస్థితులను.. సీఎం చంద్రబాబుకు వివరించారు. వెంటనే స్పందించిన బాబు.. అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ను ఉద్దానంలో పర్యటించాలని చెప్పారు. అక్కడికి వెళ్లి ఉద్దానం సమస్యలను తెలుసుకున్న మంత్రి.. ఆగమేఘాల మీద డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయించారు. అయినా.. అవి సరిపోవడం లేదు. 

ఉద్దానంలో 3 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తే సరిపోతుందా అని పవన్ ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించే వరకు బాధితులకు అండగా ఉంటానని చెప్పారు జనసేనాని. సమస్యలు చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్‌లో వైద్యారోగ్య శాఖకు మంత్రి లేరన్నారు. దీంతో.. 48 గంటల్లో వైద్యారోగ్యశాఖ మంత్రిని నియమించాలని అల్టిమేటం జారీ చేశారు.

Similar News