మరోసారి ఆందోళనకు సిద్ధమైన టీడీపీ

Update: 2018-03-02 05:09 GMT

విభజన హామీల అమలుపై ఏపీ ప్రజల్లో వెల్లువెత్తిన నిరసన సెగలు ఢిల్లీ పీఠానికి చేరినట్లే కనిపిస్తోంది. మిత్రపక్షం డిమాండ్లతో బీజేపీ పెద్దల్లో చలనం వచ్చింది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమక్షంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో టీడీపీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ భేటీలో టీడీపీ డిమాండ్లపై సుదీర్ఘ చర్చ జరిగింది. రైల్వే జోన్‌తో పాటు పలు డిమాండ్లను పరిష్కరించాలని, అమిత్‌ షాను టీడీపీ ప్రతినిధులు కోరారు. టీడీపీ డిమాండ్లపై అమిత్‌షా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా TDP అధ్యక్షుడు చంద్రబాబు ఈ ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్న గ్రీవెన్స్ హాలులో పార్టీ ఎంపీలతో సమావేశం కానున్నారు. ఈ నెల 5 నుంచి జరగనున్న రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై ఆయన ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.

విభజన హామీలతో పాటు రాష్ట్రానికి ప్రకటించిన హామీలన్నిటినీ సాధించేందుకు కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచాలని.. రాష్ట్ర హక్కుల సాధన, వివిధ పార్టీలు అనుసరిస్తున్న విధానంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశమున్నట్లు సమాచారం. మరోవైపు విభజన హామీలను నిలబెట్టుకోనందుకు నిరసనగా కేంద్రంపై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమన్న YCP ప్రకటన కూడా ఈ భేటీలో చర్చించే అవకాశముంది. ఫిబ్రవరిలో జరిగిన మొదటి విడత బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర బడ్జెట్‌పై TDP ఎంపీలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పోరుబాట పట్టారు. రెండో విడత ప్రారంభమవుతున్న ఈ సమావేశాల్లో ఎలా తమ హక్కులను సాధించుకోవాలనే అంశంపై ఎంపీలకు బాబు సూచనలు, సలహాలు ఇవ్వనున్నట్లు తెలిసింది.

Similar News