జనసేన పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే రోజా

Update: 2018-06-18 08:57 GMT

వైసీపీ ఎమ్మెల్యే రోజా సోమవారం శ్రీకాళహస్తి స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయపండితులు వారికి దర్శన ఏర్పాటు చేసి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం రోజా విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీని నిలదీస్తానని ఘీంకరిస్తూ ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు ఆయనకు వంగి వంగి సలాములు చేశారని విమర్శించారు. ఆయన ఓ అవకాశవాది అని, అందితే జుట్టు, లేకుంటే కాళ్లు పట్టుకునే వ్యక్తిఅని ఢిల్లీలో భూకంపం సృష్టిస్తానన్న చంద్రబాబు అక్కడకు వెళ్లి ఏం సాధించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మోడీని కలిసిన సమయంలో చంద్రబాబు ముఖంలో ఓ పక్క భయం, మరో పిచ్చినవ్వు కన్పించిందని ఎద్దేవా చేశారు. అవినీతి ముఖ్యమంత్రి నీతి ఆయోగ్‌ సమావేశంలో ఏమి మాట్లాడతారని ప్రశ్నించారు. ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ రోజురోజుకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక, ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేస్తున్న యత్నాల్లో భాగంగానే పనికిరాని సర్వేలతో హడావుడి చేస్తున్నారని విమర్శించారు. తాను జనసేన పార్టీలో చేరబోతున్నానంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని... చీప్ పబ్లిసిటీ కోసం టీడీపీ నేతలు ఇలాంటి వార్తలను వ్యాపింపజేస్తున్నారని ఈ సందర్భంగా రోజా మండిపడ్డారు. జనసేనలోకి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. పాదయాత్ర సందర్భంగా వైసీపీ అధినేత జగన్ కు రాజమండ్రి ప్రజలు ఘన స్వాగతం పలికారని... జగన్ కోసం ప్రజలు ఎంతగా నిరీక్షిస్తున్నారో ఇది ఒక నిదర్శనమని చెప్పారు. టీడీపీ, బీజేపీలు కుమ్మక్కై రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.
 

Similar News