19 నుంచి ఎర్రజొన్న కొనుగోళ్లు

Update: 2018-02-17 07:14 GMT

ఎర్రజొన్న రైతులను ఆదుకుంటామని మంత్రి హరీష్ తెలిపారు. రెండు రోజులు నుంచి ఎర్రజొన్న రైతులు మద్దతు ధర కోసం నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆందోళనపై స్పందించిన మంత్రి హరీష్ రావు దేశంలో ఎక్కడా ఎర్రజొన్నలను ప్రభుత్వాలు కొనడం లేదని చెప్పారు. తెలంగాణలో రూ.2300తో కొనుగోలు చేస్తున్నామన్న ఆయన కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు వాణిజ్య పంట నుంచి ఎర్రజొన్నలను ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. ఈ నెల 19 నుంచి 45 రోజులపాటు నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో కొనుగోళ్లను చేపట్టాలని నిర్ణయించింది. క్వింటాలుకు రూ.2300 మద్దతుధరతో మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్ల ప్రక్రియ నిర్వహించాలని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు జిల్లాల పరిధిలోని 33 మండలాల్లో 27,506 మంది రైతు లు 51,234 ఎకరాల్లో వేసిన ఎర్రజొన్న పంట ద్వారా 87099 టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు నివేదిక సమర్పించినట్టు జీవోలో పేర్కొన్నారు.

ఎర్రజొన్న రైతులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను నిరసిస్తూ.. రెండోరోజు ఆందోళన కొనసాగించారు. రైతు జేఏసీ పిలుపులో భాగంగా జాతీయ రహదారులపై బైఠాయించిన రైతులు.. ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్దం చేశారు. బాల్కొండ మండలం బస్సాపూర్‌లో భారీ సంఖ్యలో తరలొచ్చిన రైతులు.. నాగ్ పూర్ -ఢిల్లీ జాతీయ రహదారిపై బైఠాయించారు. రైతుల రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఆందోళన చేస్తున్న రైతన్నలను పోలీసులు అరెస్ట్ చేశారు. కమ్మర్ పల్లిలో నిజామబాద్ -కరీంనగర్ జాతీయ రహదారిపై రైతులు బైఠాయించి.. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆర్మూర్ లో అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు ప్రదర్శన నిర్వహించారు. జాతీయ రహదారిపై బైఠాయించగా.. పోలీసులు అరెస్ట్ చేశారు. 

Similar News