కరక్కాయతో కోట్లు కొట్టేశాడు

Update: 2018-07-16 11:33 GMT

కరక్కాయలతో ఆయుర్వేద మందులు తయారుచేయొచ్చని తెలుసు కానీ ఘరానా మోసం కూడా చేయొచ్చని కొందరు నిరూపించారు. హైదరాబాద్ కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డులో కరక్కాయల బిజినెస్ పేరుతో కొందరు కేటుగాళ్లు కోట్లు దండుకున్నారు. కేజీ కరక్కాయలను తీసుకెళ్లి పొడిచేసి ఇస్తే వెయ్యికి 3 వందలు లాభం ఇస్తామని చెప్పి లక్షల్లో వసూలు చేశారు. అలా కోట్లు పోగు చేసుకొని ఒకేసారి జెండా ఎత్తేశారు. దీంతో బాధితులంతా పోలీసులను ఆశ్రయించారు.

కేపీహెచ్‌బీ రోడ్ నెంబర్ 1లో సాఫ్ట్ ఇంటిగ్రేట్ మల్టీ టూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆఫీసు పెట్టారు. కరక్కాయ పొడితో తయారుచేసే ఆయుర్వేద మందులకు మంచి డిమాండ్ ఉందని బాగా ప్రచారం చేశారు. వెయ్యి రూపాయలు పెట్టి కేజీ కరక్కాయలు తమ దగ్గర కొనుక్కొని వాటిని పొడిచేసి ఇస్తే 3 వందలు లాభం ఇస్తామని చెప్పడంతో జనం ఎగబడి కొనేశారు. ఇలా వేల మంది కరక్కాయలు అమ్మి వాటి ద్వారా వచ్చిన డబ్బులతో బోర్డు తిప్పేశారు కేటుగాళ్లు. ఇప్పుడు తమకు న్యాయం చేయాలంటూ బాధితులంతా పోలీసులను ఆశ్రయించారు.

Similar News