ఈ సస్పెన్స్‌‌కు జగన్‌ తెరదీయబోతున్నారా ...అందుకు నవంబర్‌ 6ని...

Update: 2018-10-31 05:37 GMT

తనపై జరిగిన దాడిపై జగన్‌‌ ఎప్పుడు నోరు విప్పుతారు? అటాక్‌ గురించి ఏం చెబుతారు? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఇటు పార్టీ నేతల్లోనూ అటు రాజకీయ వర్గాల్లోనూ సస్పెన్స్‌గా మారాయి? అయితే ఈ సస్పెన్స్‌‌కు జగన్‌ తెరదీయబోతున్నారా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి ఇంతకీ దాడి ఘటనపై జగన్‌‌ ఎప్పుడు నోరు విప్పబోతున్నారు? 

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో తనపై జరిగిన దాడిపై వైఎస్‌ జ‌గ‌న్ ఇంతవ‌ర‌కూ స్పందించ‌లేదు. దాడి జరిగి వారం రోజులవుతున్నా జగన్‌‌ నోరు విప్పలేదు. దాడి జ‌రిగిన రోజు మాత్రం తాను క్షేమంగా ఉన్నానంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా చెప్పిన జ‌గ‌న్ ఆ ఘటనకు సంబంధించి మాత్రం ఎలాంటి విష‌యాలు చెప్ప‌లేదు. దాంతో జగన్‌ స్పందనపై ఇటు పార్టీలోనూ, అటు రాజకీయ వ‌ర్గాల్లోనూ సస్పెన్స్‌ నెలకొంది.

జగన్‌‌పై జరిగిన దాడి ఘటనపై ఇప్పటివరకూ పార్టీ నేతలు మాత్రమే స్పందిస్తున్నారు. ఇటు రాష్ట్రంలోనూ, అటు ఢిల్లీలోనూ అధికార పార్టీ టీడీపీ టార్గెట్‌గా ఆరోపణలు గుప్పిస్తున్నారు. దాడి వెనుక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర ఉందంటూ కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఏపీ ప్రభుత్వంపైనా, ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేదని, దాడి ఘటనపై కేంద్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే తనపై జరిగిన దాడిపై జగన్‌ మాత్రం ఇంతవరకు ఎలాంటి స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదు. కేసును దర్యాప్తు చేస్తోన్న సిట్‌ అధికారులకు సైతం స్టేట్‌మెంట్‌ ఇవ్వడానికి జగన్‌ నిరాకరించారు. అయితే ఈ కేసులో జగన్‌ స్టేట్‌మెంట్ అత్యంత కీలకం కనుక వాంగ్మూలం ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు సిట్‌ అధికారులు.

అయితే తనపై జరిగిన దాడిపై జగన్‌ త్వరలో స్పందించనున్నట్లు తెలుస్తోంది. తనపై జరిగిన దాడిపై నేరుగా ప్రజల్లోనే స్పందించాలని జగన్‌ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ కీలక నేతలు చెబుతున్నారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటోన్న జగన్‌ నవంబర్‌ మూడున విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం పాయకపాడు నుంచి తిరిగి పాదయాత్రను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. పాదయాత్రలో భాగంగా నవంబర్ 6న పార్వతీపురంలో బహిరంగ సభకు ప్లాన్ చేశారు. ఈ సభలోనే తనపై జరిగిన దాడిపై జగన్‌ నోరు విప్పబోతున్నట్లు తెలుస్తోంది. దాంతో నవంబర్ 6న జగన్‌ ఏం చెప్పనున్నారోనన్న ఆసక్తి  ఇటు వైసీపీలోనూ అటు రాజకీయ వర్గాల్లోనూ నెలకొంది.

Similar News