సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ

Update: 2018-03-27 09:03 GMT

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరతారు? పదవికి రాజీనామా చేసి ఆయన రాజకీయాల్లోకి వస్తున్న వార్తలు వచ్చింది మొదలు నడుస్తున్న చర్చ ఇది. బీజేపీ, టీడీపీ, జనసేన అంటూ ఊహాగానాలు వినిపించాయి. అయితే జనసేనలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి. తన పార్టీలోకి వస్తానంటే ఆహ్వానిస్తామని జనసేనాని పవన్ కళ్యాణ్. ఆయనొస్తానంటే నేనొద్దంటానా అని చెప్పేశారు. జనసేనలోకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పొలిటికల్ ఎంట్రీ దాదాపు ఖరారైనట్టే కనిపిస్తోంది. లక్ష్మీనారాయణను తమ పార్టీలో చేర్చుకొనేందుకు టీడీపీ, బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తుంటే సీబీఐ మాజీ జేడీ చూపు పవన్ పార్టీపై ఉన్నట్టు సమాచారం. 

నిజాయితీ గల అధికారిగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరున్న లక్ష్మీనారాయణ వంటి వ్యక్తి తమ పార్టీలోకి వస్తే బాగుంటుందని పవన్ అభిప్రాయ పడుతున్నట్టు తెలుస్తోంది. కొంత కాలంగా వీళ్లిద్దరూ టచ్‌లో ఉన్నారని ఒకటి రెండుసార్లు లక్ష్మీనారాయణ పవన్‌ను కలిసినట్టు తెలిసింది. ఇక తన మనసులో మాటను జనసేనాని బయటపెట్టేశారు. లక్ష్మీనారాయణ రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న ప్రచారాన్ని తాను గమనించానని చెప్పుకొచ్చారు. ఆయనకు రాజకీయ, పరిపాలన విధానాలపై మంచి పట్టుందన్నారు. 

మాజీ జేడీతో ఎలాంటి చర్చలు జరపలేదని ఒక్కసారి మాత్రమే కలిసి మాట్లాడానని చెప్పారు. ఇటీవల గుంటూరులో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభకు ముందు ఆయన తనకు ఆల్ ది బెస్ట్ చెబుతూ మేసేజ్ పెట్టారని పవన్ తెలిపారు. జేడీ లాంటి వ్యక్తి పార్టీలోకి వస్తానంటే ఎవరు కాదంటారని సాదరంగా స్వాగతం పలుకుతానని పవన్ చెప్పడం గమనిస్తే లక్ష్మీనారాయణ జనసేనలో జాయినవడం దాదాపు ఖాయమేనని అంటున్నారు.

Similar News