ఆర్ధికమంత్రి ఈటలకు కేసీఆర్‌‌ చీవాట్లు

Update: 2018-04-02 06:20 GMT

కాగ్‌ అక్షింతలతో ఆత్మరక్షణలో పడ్డ కేసీఆర్‌‌ సర్కార్... నష్ట నివారణ చర్యలు చేపట్టింది. అసలెక్కడ లోపం జరిగింది? కారణమెవరనే దానిపై సమీక్ష మొదలైంది. అన్ని రంగాల్లో లోపాలను ఎత్తిచూపడమే కాకుండా... ప్రభుత్వాన్ని తూర్పారబట్టడంతో... ముఖ్యమంత్రి కేసీఆర్‌‌.... ఇంటర్నల్‌ ఆడిటింగ్‌‌‌కు ఆదేశించారు. ఆర్ధికశాఖ నిర్వహణలో ఫెయిల్‌ అయ్యారంటూ మంత్రి ఈటలకు చీవాట్లు పెట్టిన కేసీఆర్‌‌.... కాగ్‌ కొర్రీలతో భవిష్యత్‌లో అప్పులు పుట్టవేమోనని ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో ఆర్ధిక నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందంటూ కేసీఆర్‌‌ ప్రభుత్వాన్ని కడిగిపారేసిన కాగ్‌ అన్ని రంగాల్లో లోపాలను ఎత్తిచూపింది. కేసీఆర్‌‌ చెబుతున్నట్లుగా తెలంగాణ మిగులు రాష్ట్రం కానే కాదని ముమ్మాటికీ లోటు రాష్ట్రమని ప్రభుత్వ లెక్కల్లోని డొల్లతనాన్ని ఎండగట్టింది. అప్పులను ఆస్తులుగా చూపడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. FRBM రూల్స్‌‌ ప్రకారం GSDPలో 3.5శాతానికి మించి అప్పులు తీసుకోకూడదనే నిబంధన ఉన్నా ప్రభుత్వం 4శాతానికి మించి అప్పులు చేసిందని కాగ్ కడిగిపారేసింది.

కాగ్‌ అక్షింతలతో కేసీఆర్‌‌ సర్కార్ ఆత్మరక్షణలో పడింది. దీనంతటికీ ఆర్ధిక లెక్కల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటమే కారణమని కేసీఆర్‌‌ సీరియస్‌‌ అయినట్లు తెలుస్తోంది. ఇంతకాలం ఆదర్శ పాలన సాగిస్తున్నామని తాము చెబుతుంటే కాగ్‌ తమను ప్రజల ముందు దోషులుగా నిలిపిందనే అభిప్రాయంతో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ ఆర్ధికమంత్రి ఈటలను పిలిచి చీవాట్లు పెట్టినట్లు చెబుతున్నారు. ఆర్ధికశాఖను నిర్వహించడంలో విఫలమయ్యారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. ఉదయ్‌ స్కీమ్‌ కోసం తీసుకున్న 8వేల 931కోట్ల రూపాయలను డిస్కంలకు విడుదల చేయకపోతే మంత్రిగా మీరేం చేస్తున్నారంటూ ఈటలను గట్టిగా మందలించినట్లు చెబుతున్నారు. రెవెన్యూ వ్యయంలో కాకుండా కేపిటల్‌‌లో ఉదయ్‌ లెక్కలను చూపించడం వల్లే అప్రతిష్ట కావాల్సి వచ్చిందని ఇది ఆర్ధికశాఖ వైఫల్యానికి పరాకాష్ట అంటూ ఈటలకు చీవాట్లు తెలుస్తోంది.

అప్పులపై కాగ్‌ కొర్రీలు పెట్టడంతో భవిష్యత్‌లో అప్పులు పుట్టవని సీఎం ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. అనుకున్న ఆదాయం రాకపోయినా, కొత్త అప్పు పుట్టకపోయినా ఆయా పథకాల అమలు కష్టమవుతుందని, అదే జరిగితే ఇబ్బందులపాలు కాకతప్పదని భయపడుతున్నారు. దాంతో ఇంటర్నల్‌ ఆడిటింగ్‌‌‌కు ఆదేశించిన కేసీఆర్‌‌ కాగ్‌ ఎత్తిచూపిన లోపాలపై నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. అదే సమయంలో బాధ్యులపై చర్యలకు కేసీఆర్‌ సిద్ధపడినట్లు చెబుతున్నారు. అయితే కాంగ్‌ అక్షింతలకు ఈటలను బాధ్యునిగా చేసినా ఆశ్చర్యపోనవసరం లేదనే ప్రచారం సాగుతోంది.

Similar News