కల్తీ కానుకగా మారిన చంద్రన్న కానుక

Update: 2018-01-03 07:43 GMT

ఏపీ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన చంద్రన్న కానుక పథకం గందరగోళంగా మారింది. చంద్రన్న కానుక కాస్త.. చంద్రన్న కల్తీ కానుకగా మారింది. ఓవైపు సరుకురాక... వచ్చినా అవి నాసిరకంగా ఉండడంతో... ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.  కమీషన్లకు కక్కుర్తి పడి నాసిరకం వస్తువులు అందిస్తున్నారని లబ్ధిదారులు మండిపడుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చంద్రన్న కానుక విజయనగరం జిల్లాలో విమర్శల పాలవుతోంది.

చంద్రన్న కానుక పేరుతో ఇస్తున్న వస్తువులు నాసిరకంగా ఉన్నాయని లబ్దిదారులు వాపోతున్నారు. ముక్కిపోయిన కందిపప్పు, తవుడు కలిపి గోధుమపిండిని సరాఫరా చేస్తున్నారని మండిపడుతున్నారు. పులిసిపోయి పురుగులు తేలిన  బెల్లాన్ని పంపిణి చేస్తున్నారని కానుక దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మిగతా సరుకులు కూడా  అంతంతమాత్రంగా ఉన్నాయని..  పెదవి విరుస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చంద్రన్న కానుకలో నాసిరకాన్ని తొలగించి.. ప్రతి పేదవాడికి నాణ్యమైన సరుకులు అందించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. 

చంద్రన్న కానుక కింద ఇస్తున్న కల్తీ  సరుకులు సీఎం చంద్రబాబు తిని చూపితే తాము తింటామని పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదల సొమ్ముతో అవినీతికి పాల్పడి ఇటువంటి సరుకులు  ఇవ్వటం న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. పురుగులు పట్టిన ఈ సరుకులు తీసుకుని  ఎలా తినాలి... ఏ వంటకాలు చేసుకోవాలని వాపోతున్నారు. రేషన్ షాపుల్లో నాణ్యమైన సరుకులు ఇస్తారని ఎంతగానో ఆశపడ్డామని తీరా సరుకులు తీసుకెళ్లిన తర్వాత నిరాశే మిగులుతుందని ఆవేదన చెందుతున్నారు. 

Similar News